ఒలింపిక్‌ గ్రామంలో శిక్షణలో భారత అథ్లెట్లు

టోక్యో లోని ఒలింపిక్‌ గ్రామంలో భారత అథ్లెట్లు సోమవారం నుంచి శిక్షణలను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్‌ తొలిరోజు శిక్షణకు హాజరయ్యారు. వీరితోపాటు టిటి ప్లేయర్లు సాథియాన్‌, శరత్‌ కమల్‌, పివి సింధు, సాయి ప్రణీత్‌, జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ సోమవారం ఉదయం శిక్షణలకు హాజరయ్యారు. 

ఆర్చర్ల జంట దీపిక-అతాను యోమినోషిమా పార్క్‌లో సాధన చేయగా.. సాథియాన్‌, శరత్‌ కమల్‌ గదుల్లోనే సాధనకు ఉపక్రమించారు. జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ కోచ్‌ లక్ష్మణ్‌ మనోహర్‌ శర్మ పర్యవేక్షణలో, షట్లర్‌ పివి సింధు కోచ్‌ పార్క్‌ టి సంగ్‌ పర్యవేక్షణలో, పురుషుల డబుల్‌ జోడీ చిరాగ్‌-సాత్విక్‌ కోచ్‌ మథిస్‌ బురుల పర్యవేక్షణలో శిక్షణలకు హాజరయ్యారు. 

శరవణమ్‌ (పురుషుల లేజర్‌క్లాస్‌), నేత్ర కుమనన్‌, కెసి గణపతి, వరుణ్‌ థక్కెర్‌తోపాటు రోవర్స్‌ అర్జున్‌ లాల్‌ జత్‌-అరవింద్‌ సింగ్‌ డబుల్‌ స్కల్‌ శనివారం జపాన్‌ రాజధానికి చేరుకున్నారు. వీరంతా చీఫ్‌ నేషనల్‌ కోచ్‌ ఇస్మాయిల్‌ బేగ్‌ పర్యవేక్షణలో సీ ఫారెస్ట్‌ వాటర్‌వేలో ఆదివారమే పాల్గన్నారు. ఇక 15మంది సభ్యుల షూటర్ల బృందం మూడు రోజుల నామమాత్రపు క్వారంటైన్‌లోనే మాత్రమే ఉండనున్నారు.

జపాన్‌ చేరిన అథ్లెట్లందరికీ ఎయిర్‌పోర్ట్‌లోనే కరోనా పరీక్షలు నిర్వహించి పివిసి కార్డ్‌లను అందజేయడం జరుగుతోంది. ఆ తర్వాత వీరు టోక్యో గ్రామానికి వాహనాల్లో వెళ్లి భోజనం, ఇతరత్రా అవసరాలకు ఆ కార్డ్‌ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ, కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రేక్షకుల్లేకుండా జులై 23నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి.

మరోవంక, క్రీడా గ్రామంలో పలువురు అథ్లెట్లు వరుసగా వైరస్‌ బారినపడుతున్నారు. ఆదివారం ఇద్దరు దక్షిణాఫ్రికా పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు తబిసో మోనియాని, కామొహెలో మహ్లాస్తి వైరస్‌ బారిన పడగా తాజాగా చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బీచ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌ ఒండ్రెజ్‌ పెరుసిక్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దాంతో మొత్తం ముగ్గురు ఒలింపిక్స్‌ క్రీడాకారులు వైరస్‌బారిన పడ్డారని తెలిసింది. ఇక మెగా ఈవెంట్‌లో ఇప్పటివరకు మొత్తం 58 మంది క్రీడా సంబంధిత వ్యక్తులకు కోవిడ్‌ బారినపడ్డారని నిర్వాహకులు ప్రకటించారు.