తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి

తెలంగాణ, ఎపిలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణం కానుంది. ఈ రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.4.600 కోట్లను కానుండగా, 90 కిలోమీటర్ల మేర దీని నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన భూ సేకరణ ప్రారంభం కాగా, వ్యయాన్ని మొత్తం కేంద్రమే భరించనుంది.
 
ఈ రహదారిని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి విజయవాడకు చేరుకునేందుకు అనువుగా ఉండనుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో భూసేకరణకు రెవెన్యూ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. 
 
ఖమ్మంలో కొంతమేర భూ సేకరణ పూర్తికగా, ఇప్పటికే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టును చేపట్టారు. ప్రతిరోజు ఖమ్మం నుంచి విజయవాడ నగరాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం జాతీయ రహదారి మార్గం విజయవాడ నుంచి కోదాడ వరకు, అక్కడి నుంచి రాష్ట్ర రహదారి ఖమ్మం వరకు మొత్తం 130 కి.మీ. పొడవున ఉంది. 
 
మరో మార్గం చిల్లకల్లు నుంచి వత్సవాయి మీదుగా బోనకల్లు వరకు 120 కి.మీ. ఉంది. అయితే, రైలు మార్గానికి సమాంతరంగా మరో రోడ్డు మార్గం నిర్మించాలన్న ప్రతిపాదన రావడంతో అధికారులు 2018, 2019 సంవత్సరంలో దీనికి సంబంధించిన నివేదికను రూపొందించారు. ఈ మార్గం పూర్తయితే 30 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు.
 
ప్రస్తుత గ్రీన్‌ఫీల్డ్ రహదారి 90 కిలోమీటర్లు వస్తుండగా, ఇందులో కృష్ణాలో 30 కి.మీ, ఖమ్మంలో 60 కి.మీలు ఉంటుంది. రహదారి నిర్మాణానికి అయ్యే ఖర్చు దాదాపు రూ.4.600 కోట్లను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు.
 
ఖమ్మం నుంచి బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, మీదుగా చెరువు మాధవరం, జి.కొండూరు మీదుగా రాయనపాడుకు చేరుకుంటుంది. అక్కడ సక్కంపూడి సమీపంలో విజయవాడ బైపాస్ రహదారికి అనుసంధానించనున్నారు. కృష్ణా జిల్లాలో గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణం మండలాలోని గ్రామాల మీదుగా ఈ రహదారి వెళుతుంది.