అక్టోబర్ 1 నుంచి కొత్త విద్యాసంవత్సరం

అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) వెల్లడించింది. సెప్టెంబర్ 30 నాటికి మొదటి సంవత్సరం డిగ్రీ, పిజి ప్రవేశాలు పూర్తి చేయాలని తెలిపింది. 2021- 22 విద్యాసంవత్సరానికి సంబంధించి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు, తరగతులకు సంబంధించి యుజిసి అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది. 

ఆగస్టు 31 లోపు చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఏదేని కారణాల వల్ల 12 తరగతి బోర్డు ఫలితం ఆలస్యం అయితే, అక్టోబర్ 18 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించవచ్చునని యుజిసి మార్గదర్శకాల్లో పేర్కొంది. 

సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ సహా అన్ని రాష్ట్రాల బోర్డు ఫలితాలు వెల్లడైన తర్వాతే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించేలా ఉన్నత విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలని యుజిసి ఆదేశించింది. ఒకవేళ విద్యార్థులు అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజును తిరిగి ఇచ్చేయాలని సూచించింది.

కరోనా పరిస్థితుల దృష్ట్యా అక్టోబర్ 31 వరకు ప్రవేశాలను రద్దు చేసిన విద్యార్థుల నుంచి విశ్వవిద్యాలయం రద్దు ఫీజు వసూలు చేయకూడదని తెలిపింది. డిసెంబర్ 31 వరకు ప్రవేశాన్ని రద్దు చేసిన విద్యార్థికి ప్రాసెసింగ్ ఫీజు గరిష్టంగా రూ.1000 వసూలు చేయవచ్చని పేర్కొంది. కరోనా కారణంగా విద్యార్థుల తల్లితండ్రులు ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

బోధనాభ్యాసన ప్రక్రియ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లేదా రెండింటి కలయికలో నిర్వహించవచ్చని తెలిపింది. అక్టోబర్ 1 నుంచి జులై 31 మధ్య విద్యా సంవత్సర ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించింది. ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసుకోవడానికి కళాశాలలకు అక్టోబర్ 31 వరకు గడువు ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం నిబంధనలు రూపొందించుకోవాలని తెలిపింది.

ఫైనల్ ఇయర్ పరీక్షలతో పాటు సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని యుజిసి పేర్కొంది. పరీక్షలను ఆఫ్‌లైన్ (పెన్, పేపర్) లేదా/ ఆన్‌లైన్ / బ్లెండెడ్ (ఆన్‌లైన్ + ఆఫ్‌లైన్) మోడ్‌లో 2021 ఆగస్టు 31 లోపు నిర్వహించాల్సి ఉంటుంది. కొవిడ్ పరిస్థులను దృష్టిలో పెట్టుకుని విశ్వవిద్యాలయాలు వ్యవహరించాలని యుజిసి పేర్కొన్నది. 

ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో నడుస్తుందో లేదో ఆయా వర్సిటీలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ఎఐసిటిఇ, ఎన్‌సిటిఇ, బిసిఐ, ఎన్‌ఎంసి, డిసిఐ, ఎన్‌ఎంసి, ఐఎన్‌సి, పిసిఐ, ఆయుష్ వంటి విద్యాసంస్థలతో సంప్రదించి విద్యాసంస్థల క్యాలెండర్, మార్గదర్శకాలను తర్వాత జారీ చేసినట్లు యుజిసి తెలిపింది. 

హిమాచల్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో 12 వ తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నెలాఖరుకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జూలై 31 లోపు బోర్డ్ ఫలితాలను అన్ని రాష్ట్రాలు విడుదల చేస్తాయనే భరోసాతో ఉన్నట్లు యుజిసి తెలిపింది.