సోనియా పట్ల అమరిందర్ సింగ్ ధిక్కార స్వరం

కొద్ద నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తొలగించడం కోసం అసమ్మతి నేత, మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్దును ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించడంపై కాంగ్రెస్ అధినాయకత్వం – సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సిద్ధపడుతున్న సమయంలో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ తీవ్రమైన అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. 
 
సీఎంగా కెప్టెన్ అమరీందర్‌ను కొనసాగిస్తూనే, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు సిద్దూకు అప్పజెప్పాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఈ నిర్ణయంపైనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిప్పులు గక్కుతూ అధినేత్రి సోనియా గాంధీకి శుక్రవారం ఓ లేఖ రాశారు. పంజాబ్ విషయంలో అధిష్ఠానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని తీవ్రంగా దుయ్యబట్టారు. 
 
పంజాబ్‌లో పరిస్థితి అంత అనుకూలంగా ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అధిష్ఠానం వ్యవహార శైలితో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. పార్టీలోని సీనియర్లను తక్కువగా అంచనా వేయవద్దని, అలా తక్కువగా అంచనా వేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఒకరు సోనియా గాంధీ కుటుంభం పట్ల బహిరంగంగా ధిక్కార ధోరణి ప్రదర్శించడం  ఇటీవల కాలంలో బహుశా ఇదే. ఇంతకు ముందే సోనియాను కలసిన అమరిందర్ సింగ్ సిద్ధుకు పార్టీ నాయకత్వం అప్పగించే ఆలోచనల పట్ల తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. నిలకడలేని సిద్ధుకు పార్టీ నాయకత్వం అప్పజెబితే భారీ మూల్యం రాజకీయంగా చెలింపవలసి వస్తుందని హెచ్చరించారు.
దానితో సిద్ధుకు పార్టీ నాయకత్వం అప్పచెప్పిన పంజాబ్ లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. అదే జరిగితే ఎన్నికల సమయంలో పార్టీ పేలవమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చీలికకు రారితీసే అవకాశం ఉన్నట్లు కూడా సంకేతాలు వెలువడుతున్నాయి.

 
వాస్తవానికి 2017 అసెంబ్లీ ఎన్నికల ముందే అమరిందర్ సింగ్ వ్యతిరేకిస్తున్న నాయకుడికి ప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం అప్పగించి, ఎన్నికలలో గెలుపొందితే ఆయనను ముఖ్యమంత్రిగా చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేశారు. ఆ విధంగా చేస్తే తాను పార్టీని  వదిలి, ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయగలనని సింగ్ బలమైన సంకేతం ఇవ్వడంతో పార్టీ అధిష్ఠానం వెనుకడుగు వేసింది. ఆ ఎన్నికల ప్రచారంలో కూడా రాహుల్ పెద్దగా పాల్గొనలేదు. 

ముఖ్యమంత్రి 80వ వడిలో ప్రవేశిస్తున్నందున ఆయనకు రాజకీయ వారసునిగా సిద్దును ప్రోత్సహించాలని రాహుల్, ప్రియాంక ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. కానీ అటువంటి ప్రయత్నం పార్టీలో మరో అధికార కేంద్రం ఏర్పాటుకు దారితీస్తుందని అమరిందర్ బలంగా ప్రతిఘటిస్తున్నారు. 
 
పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక బాధ్యత అప్పగిస్తే రాగాల ప్రమాదాన్ని ముందే అంచనా వేస్తున్నారు. మరోవంక సిద్దు నియామక ప్రతిపాదనకు నిరసనగా అమరిందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారని కధనాలు కూడా సోషల్ మీడియాలో వ్యాపించారు.
 
 “CM @capt_amarinder రాజీనామా చేసినట్లు ప్రచారం చేరింది. అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు రవీం చక్రాల ట్వీట్ చేశారు. 2017 లోనే కాదు 2022లో కూడా పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీని అమరిందర్ విజయం వైపు నడిపిస్తారని భరోసా వ్యక్తం చేశారు.