గెజిట్‌ నోటిఫికేషన్‌కు ముందు ఎంతో చర్చించాం

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్‌ విడుదల చేశామని కేంద్ర జలశక్తి జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ అవస్థి స్పష్టం చేశారు.  విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపిణీ జరగిందని, సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటైందని తెలిపారు. 
 
దీనిలో భాగంగా 2016 సెప్టెంబర్‌లో తొలిసారి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశమైందని, అయితే  అందులో కమిటీ సరైన నిర్ణయం తీసుకోలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు.  మరోసారి 2020 అక్టోబర్‌ 6న కమిటీ మళ్లీ సమావేశమైందని గుర్తు చేశారు. కాగా,   2014 నుంచి రెండు బోర్డులపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే బోర్డుల పరిధి నిర్ణయించినట్లు వెల్లడించారు. గురువారం రాత్రి ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు ముందు ఎంతో చర్చించామని, సీడబ్యూసీతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వచ్చామని వివరించారు. ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రతి పదం, ప్రతి వాక్యం రాశామని, విభజన చట్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు.
బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాలని, నోటిఫికేషన్‌ వచ్చిన 60రోజుల్లో రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలని తెలిపారు. బోర్డుల నిర్వహణకు నిధులు, వనరుల కొరత రాకూడదని సూచించారు. ఏ ప్రాజెక్ట్‌ ఆమోదం పొందిందో.. ఏది ఆమోదం పొందలేదో నిర్వచించామని చెప్పారు.
 మొదటి షెడ్యూల్‌లో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్ట్‌ల పేర్లు చేర్చామని, రెండో షెడ్యూల్‌లో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఆధ్వర్యంలో ఉండే ప్రాజెక్ట్‌ల పేర్లు చేర్చామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరిస్తామని వెల్లడించారు. మూడో షెడ్యూల్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లను రాష్ట్రప్రభుత్వాలు నిర్వహిస్తాయని ఆయన పేర్కొన్నారు.