సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాజీ రక్షణ మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో కీలక భేటీ నిర్వహించారు. చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించారు.
ఈ సమావేశానికి త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె కూడా హాజరయ్యారు. జులై 19నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో రాజ్‌నాథ్ సమావేశం నిర్వహించారు. చైనా-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై కాంగ్రెస్ కేంద్రాన్ని తరుచూ నిలదీస్తున్నది. కాగా ఉత్తర సిక్కింలోని నకులా, తూర్పు లఢక్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా కాంక్రీట్ నిర్మాణాలను చేపడుతున్నట్టు మీడియాలో గురువారం కథనాలు వెలువడటం తెలిసిందే.
మరోవంక, రాజ్యసభ నూతన నేత పీయూష్‌గోయల్‌తోనూ శరద్‌పవార్ భేటీ అయ్యారు. గోయల్‌తో భేటీ అయిన వారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ మరో నేత ఆనంద్‌శర్మ కూడా ఉన్నారు. గత సమావేశాల వరకు రాజ్యసభ నేతగా వ్యవహరించిన థావర్‌చంద్ గెహ్లాట్‌ను కర్నాటక గవర్నర్‌గా నియమించడంతో గోయల్‌కు రాజ్యసభ బాధ్యతలు అప్పగించారు.
సభ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రతిపక్ష నేతలతో గోయల్ చర్చించినట్టు చెబుతున్నారు. ఈ సమావేశాల్లోనే జనాభా నియంత్రణ, ఉమ్మడి పౌర స్మృతిపై బిజెపి ఎంపీలు ప్రైవేట్ బిల్లుల్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 13 వరకు సాగే పార్లమెంట్ సమావేశాల్లో 17 కొత్త బిల్లుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. వీటిలో ఇటీవల జారీ చేసిన మూడు ఆర్డినెన్స్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
More Stories
ఇస్రో మరో ఘనత.. స్పేడెక్స్ డాకింగ్ విజయవంతం
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి
కర్ణాటకలో మరోసారి కుర్చీలాట