వి హెచ్ పి నేత రావినూతల శశిధర్ అరెస్ట్

విశ్వ హిందూ పరిషద్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ను వనస్థలీపురం పోలీసులు.నేటి ఉదయం అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో గోహత్య నిరోధక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భజరంగ్ దళ్ ఇచ్చిన `చలో ప్రగతి భవన్’ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అరెస్ట్ లతో  తమ ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేస్తూ రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతున్నదని, కేసీఆర్ ప్రభుత్వం గో హంతకులకు కొమ్ముకాస్తున్నదని శశిధర్ విమర్శించారు. గోరక్షణ కోసం ప్రతి హిందువు ముందుకు కదులుతున్నారని స్పష్టం చేశారు. 

తెలంగాణాలో గోరక్తం ఏరులై పారుతూ ఉండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 15న ఉదయం 11 గంటలకు `చలో ప్రగతి భవన్’  ఆందోళనకు భజరంగ్ దళ్ పిలుపిచ్చింది. గోమాత పూజ జరిగిన ప్రగతి భవన్ లో నయా ఖాసిం రజ్వీలు రాజ్యమేలుతున్నారని మండిపడింది. సకల దేవతలకు నిలయమైన గోమాతను రక్షించుకోవడం మనందరి కర్తవ్యమని విజ్ఞప్తి చేసింది.

గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గో అక్రమ రవాణాదారులపై పి.డి యాక్టు నమోదు చేయాలని, బక్రీద్ కోసం వధించడానికి పాత పట్టణంలో ఉంచిన పశు సంపదను వెంటనే కాపాడాలని, జాతీయ రహదారులపై కేంద్ర బలగాల సహకారంతో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది.

గోరక్షకులపై జరిగిన హత్యాయత్నాలపై నింధితులను వెంటనే అరెస్టు చేయాలని, గో అక్రమ రవాణా దారులతో కుమ్మక్కైన పోలీసు మరియు పశు వైద్యులను డిస్మిస్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని, గోరక్ష కోసం ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని, రాష్ట్రంలోని గోవధ శాలలు మూసి వేయాలని భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది.

ఇలా ఉండగా, పరిగిలో అక్రమంగా పశువులను కబేళాలకు తరలిస్తున్న రెండు డీసీఎంలను పోలీసులు పట్టుకున్నారు. కోడంగల్ చెక్ పోస్ట్ వద్ద ఆపకుండా వేగంగా దూసుకువెళ్లిన రెండు వాహనాలను పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. రెండు వాహనాల్లో మొత్తం 38 పశువులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ రవాణా చేస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పశువులను పశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.