`చలో ప్రగతి భవన్’ కు రాష్ట్ర వ్యాప్తంగా కదలిన గోభక్తులు

గోపూజతో ప్రారంభమైన ప్రగతి ఎఐఎంఐఎం  అజెండాను  అమలు చేస్తూ గోరక్తంతో తడుస్తుందని, తెలంగాణా రాష్ట్రంలో గోహత్య నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేసి గోరక్షణ చేయాలనే ప్రధాన డిమాండ్ తో బజరంగ్ దళ్ రాష్ట్ర కమిటి ఈరోజు ఇచ్చిన `చలో ప్రగతి భవన్ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి గోభక్తులు తరలి వచ్చారు. 
 
బజరంగ్ దళ్ `చలో ప్రగతి భవన్’ పిలుపునివ్వడంతో గడిచిన రెండు రోజుల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్ కార్యకర్తలను, గో భక్తులను ముందస్తు అరెస్టులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సుమారు 2000 మందికి పైగా విహెచ్పి  నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. 
 
పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. రామరాజు, రాష్ట్ర అధికార ప్రతినిది రావినూతల శశిధర్ లతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలను గత రాత్రి నుండే అదుపులోకి తీసుకొని, హైదరాబాద్ నగరానికి దారితీసే అన్ని రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ఎక్కడి దక్కడ కార్యకర్తలను అరెస్టు చేసిన్పటికీ  ఉద్యమాన్ని ఆపలేకపోయారు. 
 
బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, రాష్ట్ర నాయకులు శివరామ్, కుమార స్వామి ల నేతృత్వంలో గోభక్తులు ప్రగతి భవన్ గేట్ల వద్దకు చేరుకొని నిరసనకు దిగడంతో పోలీసులు విచక్షణా రహితంగా గోభక్తులపై భౌతిక దాడులు చేశారు. దీంతో రుద్ర బ్రహ్మం, అనీల్ కుమార్, సాయి తదితర కార్యకర్తలకు తీవ్ర గాయాలకు గురయ్యారు. 
రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు చేశారు. అయినా విడతల వారీగా ప్రగతి భవన్ ముట్టడికి భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రయత్నించారు. రెండు విడుతలుగా క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చారు. అయితే అప్రమత్తమైన పోలీసులు.. కొందర్ని ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరనే అడ్డుకొని షహనాజ్ గంజ్ పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు. మరో విడతగా భజరంగ్ దళ్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ గేటు దగ్గరకు రాగా  పోలీసులు వాళ్లను కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌కు తరలించారు. 
 
 ప్రగతి భవన్ వద్ద అరెస్టు చేసిన వందలాది మంది బజరంగ్ దళ్ కార్యకర్తలను గోశామహల్ స్టేడియానికి తరలించారు. ప్రగతి భవన్ వద్ద పోలీసులు జరిపిన దాడిలో గాయపడి ఉస్మానియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కార్యకర్తలను పరిషద్ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, నగర అధ్యక్షులు శ్రీనివాస రాజు తదితరులు పరామర్శించారు. 
 
ఈసందర్భంగా బండారి రమేష్ గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన పరిషద్,  బజరంగ్ దళ్ కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలనిడిమాండ్ చేశారు. గోరక్షణ కోసం ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ఉద్యమాలు ఉదృతం చేసి రజాకార్ పాలనకు చరమగీతం చెబుతామని హెచ్చరించారు. 
 
ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలుపుతున్న కార్యకర్తలపై పోలీసులు భౌతిక దాడులు జరపడం సిగ్గుచేటని విమర్శించారు.  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వ నయా నిజాం పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. కేసీఆర్ హిందూ వ్యతిరేక విధానాలకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని స్పష్టం చేశారు.