ఒలింపిక్స్‌ పతాకాలతో తిరిగి రండి …. ప్రధాని ఆకాంక్ష

భారతీయ క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్ 2020 నుండి పతాకాలతో తిరిగి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ నెల 23 నుండి టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లతో ప్రధాన మంత్రి మంగళవారం సాయంత్రం  పర్చువల్ పద్ధతిలో సమావేశమై ఈ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రతిభను కనబరచాలని పిలుపునిచ్చారు. అసాధారణ ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింపచేయాలని సూచించారు. క్రీడాకారులకు దేశం మొత్తం అండగా ఉందని భరోసా ఇచ్చారు. అత్యున్నత వేదికపై జరుగుతున్న క్రీడల్లో భారత పతాకం రెపరెపలాడించాలని కోరారు. ఈ క్రీడల్లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రదర్శనతో పతకాల పంట పండిస్తారనే ధీమాను ప్రధాని వ్యక్తం చేశారు. 

ఒలింపిక్స్ వంటి చారిత్రక క్రీడల్లో పతకాలు సాధించడం ద్వారా తామెంటో ప్రపంచానికి చాటాలని కోరారు. దేశభక్తితో మమేకమై ఉండే ఒలింపిక్స్ వంటి క్రీడల్లో ప్రతి అథ్లెట్ సర్వం ఒడ్డి పోరాడాలని సూచించారు. అత్యుత్తమ ప్రదర్శనతో ఇతర దేశాల క్రీడాకారులకు గట్టిపోటీ ఇవ్వాలని చెప్పారు. రానున్న రోజుల్లో భారత్‌ను క్రీడల్లో మెరుగైన దేశంగా తీర్చిదిద్దడమే లక్షంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

చైనా, అమెరికా, యూరప్ దేశాలకు దీటుగా భారత్ కూడా ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రీడల కోసం భారత క్రీడాకారులు చాలా ఏళ్లుగా కఠోర సాధన చేస్తున్నారని, వారందరికి దేశ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయన్నారు. ఆటగాళ్ల శ్రమ వృథాగా పోదని, వారికి కృషికి తగినట్టు ఫలితాలు వస్తాయనే నమ్మకం తనకుందన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలువురు దిగ్గజ క్రీడాకారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వీరిలో బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, స్టార్ షట్లర్ పి.వి.సింధు, షూటర్ సౌరభ్ చౌదరి, టిటి ఆటగాడు శరత్ కమల్ తదితరులు ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుతేజం సింధు తల్లిదండ్రులపై ప్రశంసలు కురిపించారు. సింధు వంటి ప్రతిభావంతురాలైన షట్లర్‌ను అందించి దేశం గర్వ పడేలా చేశారని రధాని ప్రశంసించారు. అంతేగాక మేరీకోమ్ సేవలను కూడా ప్రధాని కొనియాడారు. 

ఈ క్రీడల్లో భారత్ తరఫున మొత్తం 119 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. భారత్ నుంచి మొత్తం 228 మందితో కూడిన ప్రతినిధి బృందం ఈ నెల 17న   జపాన్‌కు బయలుదేరి వెళ్లనుంది. వీరిలో అథ్లెట్లతో పాటు సహాయక సిబ్బంది, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు తదితరులు ఉన్నారు. ఇక భారత క్రీడాకారులు 85 విభాగాల్లో పతకాల కోసం పోటీ పడుతున్నారు.