వ్యాక్సిన్ల కొరత అంటూ ప్రజలలో భయాందోళనల వ్యాప్తి 

దేశంలో వ్యాక్సిన్ల కొరత ఆరోపణలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా బుధవారం ఖండించారు. జూలై వరకు టీకా మోతాదుల లభ్యతను 13.50 కోట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేందుకు పనికిరాని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. 
 
టీకాల లభ్యత, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, నాయకుల ప్రకటనలు, లేఖల ద్వారా తెలుసుకున్నానని, వాస్తవ విశ్లేషణ ద్వారా పరిస్థితి అర్థం చేసుకోవచ్చని కేంద్రమంత్రి పేర్కొన్నారు. కేంద్రం జూన్‌లో 11.46 కోట్ల వ్యాక్సిన్‌ మోతాదులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించిందని, జూలై వరకు మోతాదుల లభ్యతను 13.50 కోట్లకు పెంచారని కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు.
 
జూలైలో ఎన్ని మోతాదులను అందుబాటులోకి తెస్తామో జూన్‌లో కేంద్రం రాష్ట్రాలకు తెలిపిందన్నారు. మొదట జూన్‌ 19న.. ఆ తర్వాత జూన్‌ 27న, మళ్లీ జూలై 13న మొదటి, రెండు పక్షాలకు సంబంధించి వ్యాక్సిన్ల లభ్యతపై రాష్ట్రాలకు కేంద్రం సమాచారం ఇచ్చిందని తెలిపారు. 
 
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా స్థాయిలో టీకాలు వేసేందుకు వీలుగా ఇలా చేస్తుందని మంత్రి ట్వీట్‌ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా సహా అనేక రాష్ట్రాలు వ్యాక్సిన్ల కొరతపై వార్తల నేపథ్యంలో కేంద్రమంత్రి ట్విట్టర్‌ ద్వారా ఈ వ్యాఖ్యలు చేశారు.