రాజ్యసభ నాయకుడిగా పీయూష్ గోయల్

రాజ్యసభలో బీజేపీ నేతగా ఆయన కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో ఈ బాధ్యతల్లో థావర్‌చంద్ గెహ్లోత్ ఉండేవారు. థావర్ చంద్ కర్నాటక గవర్నర్‌గా వెళ్లడంతో ఈ పదవి  ఖాళీ అయ్యింది. దీంతో పీయూశ్ గోయల్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం ఎన్డీయే డిప్యూటీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
 
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. 2010 నుంచి పీయూశ్ రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.  బిజెపి నాయకుడిగా ఆయన సభానాయకుడిగా వ్యవహరిస్తారు. గతంలో మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ ఈ హోదాలో కొనసాగారు. 
 
కాగా, పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ నెల 18న అఖిలపక్షం సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి అధ్యక్షతన సమావేశం జరుగుతుందని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సైతం ఫ్లోర్‌ లీడర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఇంతకు ముందు స్పీకర్‌ ఓం బిర్లా మాట్లాడుతూ కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
 
పార్లమెంట్‌ సమావేశాలకు ముందు సభ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు కొనసాగేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. వర్షాకాల సమావేశాలు ఈ నెల 19 నుంచి ఆగస్ట్‌ 13 వరకు కొనసాగనుండగా,కేంద్ర ప్రభుత్వం సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. 
 
రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నివాసంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌, భూపేంద్ర యాదవ్‌, ప్రహ్లాద్‌ జోషి, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌తో పాటు 20 మంది వరకు బీజేపీ సీనియర్‌ నేతలు సమావేశమై చర్చించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, కొవిడ్‌-19 మహమ్మారిపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.