మావోయిస్టు వినోదన్న కరొనతో మృతి

మరో కీలకమైన మావోయిస్టు నాయకుడు వినోద్ హేమ్లా అలియాస్ హుంగా అలియాస్ వినోదన్న, కాంగ్రెస్ నాయకుల 2013 దర్భా లోయ ఉచకోతలో కీలక నిందితుడు, జూలై 11 న బస్తర్ ప్రాంతంలోని నక్సల్ అజ్ఞాతవాసంలో కరోనా కారణంగా మరణించినట్లు తెలుస్తున్నది. అతనిపై రూ 15 లక్షల రివార్డు ఉంది.

ఈ మావోయిస్టు నాయకుడు ఒక నెలపాటు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, బస్తార్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల అంతర్-జిల్లా సరిహద్దుల్లోని అజ్ఞాతవాసంలో మరణించాడని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. ఆయన చివరి కర్మలు జూలై 13 న జరిగిన్నట్లు చెప్పారు.

వినోదన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) దర్భా డివిజనల్ కమిటీ సభ్యుడు. మొదట సుక్మా జిల్లాలోని పువర్తి గ్రామంలో నివసించేవాడు.   పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) కమాండర్, మోస్ట్ వాంటెడ్ నక్సల్ హిద్మా స్వస్థలం ఆ గ్రామం.


ఈ మధ్యకాలంలో కరోనా కారణంగా మావోయిస్టుల నాయకుల మరణాలలో వినోద్ మరణం ఒకటి. ఈ ఏడాది మే నుండి మావోయిస్టుల శిబిరంలో కరోనా వైరస్ కారణంగా డజన్ మందికి పైగా మావోస్టు నాయకులు, దళ సభ్యులు మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మావోయిస్టులు హరిభూషణ్ మరియు భరత్తక్క అనే ఇద్దరు నాయకుల మరణాన్ని మాత్రమే అధికారికంగా జూన్ 24న అంగీకరించారు.
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ) బెటాలిన్ కమాండర్ హిద్మాతో పాటు  వినోద్, సోను, జైమాన్ లకు కూడా కరోనా పాజిటివ్ అని తెలున్నట్లు ఐజి సుందరరాజ్ ప్రకటించారు. వీరిలో ఇప్పుడు వినోద్ మరణించినట్లు ధృవీకరించారు.

1994 లో మావోయిస్టు శిబిరంలో చేరిన వినోద్ హేమ్లా అలియాస్ వినోదన్న, దంతేవాడ, బస్తర్, సుక్మా,  బీజాపూర్ జిల్లాల్లో కనీసం 16 పెద్ద హింసాయుత సంఘటనలకు సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. కటేకాలియన్, మలంగీర్,  కంగెర్ లోయ ప్రాంతంలో చురుకుగా ఉన్న వినోదన్నను 2009 లో దర్భా డివిజనల్ కమిటీ సభ్యునిగా చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాజీ మే మంత్రి మహేంద్ర కర్మ, అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్ కుమార్ పటేల్, సీనియర్ నాయకుడు విద్యాచరన్ శుక్లా (కొద్ది రోజుల తరువాత గాయాల పాలయ్యారు) సహా మే 2013 లో 27 మంది మరణించిన దర్భ లోయ దాడిలో ఆయన ఒక ప్రధాన నిందితుడు. .

30 ఏళ్ల కిందటే తెలంగాణ నుంచి చత్తీస్‌ గఢ్ కి వెళ్లిన మావోయిస్టుల్లో వినోద్‌ కూడా ఒకరు. చత్తీస్‌ గఢ్ లో జనతన సర్కార్‌ను విస్తరించడంతో పాటు, మద్దతు సాధించడంలో ఆయన కీలక పాత్ర వహించారు. దక్షిణ ప్రాంతీయ మావోయిస్టుల కమిటీలోనూ వినోద్‌ కీలకంగా వ్యవహరించారు. 

మరోవైపు వినోద్‌ను పట్టుకునేందుకు ఎన్ఐఎ చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది.  మావోయిస్టు వినోద్‌ మోస్ట్‌ వాంటెండ్‌గా పరిగణిస్తున్నరు. ప్రస్తుతం అతనిపై రూ 15 లక్షల రివార్డ్ ఉంది. ఇందులో పది లక్షల రూపాయలు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రకటించగా, రూ. 5 లక్షలు ఎన్ఐఎ ప్రకటించింది.