పోలీసు బలగాల్లో 33 శాతం మహిళలను నియమించాలని కేంద్రం పునరుద్ఘాటించింది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ‘మహిళలు, చిన్నారులపై దాడులు’కు సంబంధించి హోంశాఖ పార్లమెంటరీ స్టాయీ సంఘం నివేదికలో సూచించిన సిఫార్సుల మేరకు పోలీసు బలగాల్లో మహిళల సంఖ్యను పెంచాలని పేర్కొంది.
ప్రస్తుతం పోలీసు బలగాల్లో మహిళలు 10.30 శాతం మాత్రమే ఉండటంపై స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసిందని తెలిపింది. పోలీసుల బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచడం ఎందుకు ఆలస్యం అవుతోందో అర్థం కావడంలేదని నివేదికలో పేర్కొందని తెలిపింది.
పోలీసు బలగాల్లో మహిళల ప్రాతినిథ్యం 33 శాతం ఉండటం తప్పనిసరి అని ఎప్పటికప్పుడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ సూచనలు చేయాలని స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తుచేసింది.
పోలీసు బలగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళల ప్రాతినిథ్యం పెంచడానికి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ నిర్వహించాలని సూచించింది. ఈ మేరకు చేపట్టిన చర్యలను తమ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది.

More Stories
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంలో భిన్నాభిప్రాయం
కావేరి నదీ జలాల వివాదంలో థర్డ్ పార్టీలు జోక్యం చేసుకోలేవు
జైష్ ఉగ్రవాది గాలింపు కోసం కాశ్మీర్లోని 5 జిల్లాల్లో హై అలర్ట్