కేరళలో నెలల తరబడి కట్టడి కాని మహమ్మారి

 కరోనా తొలి దశలో వైరస్‌ను కట్టడి చేయడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కేరళ ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కేసుల సంఖ్య ను తగ్గించడానికి అహర్నిశలు శ్రమించాల్సి రావడం చూసేవారికి విస్మయం కలిగిస్తున్నది. ఏడాది క్రితం కరోనా తొలి దశ కట్టడిలో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నఈ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి రోజూ 12 వేలనుంచి 15 వేల మధ్య కేసులు వెలుగు చూసున్నాయి. 

రోజూ 10 వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోదవుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా అక్క‌డ 12,220 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అదేస్థాయిలో ఉంటున్న‌ప్ప‌టికీ.. యాక్టివ్ కేసుల త‌రుగుద‌ల‌లో వేగం మంద‌గించింది. ఇవాళ కొత్తగా 12,502 మంది మ‌హ‌మ్మారి బారి నుంచి కోలుకున్నారు.

కేర‌ళ‌లో క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఎక్కువ‌గానే న‌మోద‌వుతున్నాయి. ఇవాళ కొత్త‌గా 97 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 14,586కు చేరింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఇంకా 1,14,844 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం సైతం రాష్ట్రంలో కొత్తగా 14 వేలకు పైగా కేసులు వెలుగు చూడగా 109 మంది వైరస్‌తో పోరాడుతూ మృత్యువాత పడ్డారు.

ఈ ఏడాది జూన్ 1వ తేదీన కేరళలో దాదాపు 20 వేల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వారం రోజుల పాటు అవి తగ్గుముఖం పడుతూ 7వ తేదీ నాటికి 9313కు చేరాయి. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ 16 వేలను దాటిపోయాయి. గడచిన నెల రోజులుగా రాష్ట్రంలో సగటున ప్రతి రోజూ 11వేలనుంచి 13 వేలదాకా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

దేశంలో తొలి కరోనా కేసు కేరళకు చెందినదే కావడం ఇక్కడ గమనార్హం. 2020 జనవరిలో వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలోని వుహాన్‌నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థికి కరోనా నిర్ధారణ అయింది. వుహాన్‌నుంచి వచ్చిన రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరికి కూడా పాజిటివ్ రాగా ఆ తర్వాత వారంతా కోలుకోవడం జరిగింది.

దేశంలో 80 శాతానికిపైగా కొత్త కేసులు 15 రాష్ట్రాల్లోని 90 జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఇందులో 50 శాతానికిపైగా కొత్త కేసులు మహారాష్ట్ర, కేరళ నుంచే ఉంటున్నాయి.