నేపాల్ నూతన ప్రధానిగా షేర్ బహదూర్ దేవుబా

నేపాల్‌లో మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు నెలల వ్యవధిలో రెండోసారి రద్దయిన నేపాల్ ప్రతినిధుల సభను సోమవారం ఆ దేశ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. 

అంతే కాకుండా రెండు రోజుల్లోగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబాను ప్రధానిగా నియమించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో చీఫ్ జ‌స్టిస్ చోలేంద్ర షంషేర్ రాణా నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ ధ‌ర్మాసనం గ‌త వారం వాద‌న‌లు విన‌డం పూర్తి చేసింది.

కాగా, ప్రధాని కేపీ శర్మ ఓలి సిఫార్సు మేరకు మే 22న నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి దిగువ సభను రద్దు చేశారు. ఐదు నెలల వ్యవధిలో దిగువ సభను రద్దు చేయడం ఇది రెండోసారి. ప్రధాని కేపీ శర్మ సిఫార్సు మేరకు ఆ దేశ అధ్యక్షురాలు నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలను ప్రకటించారు.

ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఆ దేశ ఎన్నికల సంఘం గత వారమే విడుదల చేసింది. అయితే దిగువ సభను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్‌తోపాటు మొత్తం 30 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.