రోదసిలోకి వెళ్లొచ్చిన తెలుగమ్మాయి శిరీష

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ బృందం వ్యోమనౌక విఎస్‌ఎస్ యూనిటీ-22 ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. తెలుగమ్మాయి, ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష సహా ఆరుగురు వ్యోమగాములతో న్యూమెక్సికో నుంచి వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమనౌక రోదసీలోకి పయనమైంది. 

దాదాపు గంట తర్వాత వ్యోమనౌక రోదసిలో ప్రయాణించి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చింది. తద్వారా తెలుగు యువతి బండ్ల శిరీష అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రోదసియానం చేసిన నాలుగో భారతీయురాలిగా ఆమె నిలిచింది. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత శిరీష ఈ ఘనత సాధించింది.

బండ్ల శిరీష కొన్నాళ్లుగా వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, రీసెర్చ్ ఆపరేషన్‌ల వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. శిరీష 2015లో ప్రభుత్వ వ్యవహారాల మేనేజర్‌గా వర్జిన్ గెలాక్టిక్‌లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడీ స్థాయికి చేరుకున్నారు. పర్‌డ్యూ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ ప్రయాణం ఆరంభం అయింది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థను స్థాపించి వ్యోమనౌకలో తనతో పాటు మరో ఐదుగురిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లుతున్నారు. ఈ అంతరిక్ష ప్రయాణంలో భాగంగా తెలుగు అమ్మాయి 34 సంవత్సరాల బండ్ల శిరీష కూడా ఉండటంతో దీనికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. వాతావరణ మార్పుల కారణంగా అంతరిక్ష ప్రయాణం దాదాపు అరగంట ఆలస్యంగా ఆరంభం అయింది. అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి ఇప్పుడు బిజినెస్ మాగ్నెట్‌లు రిచర్డ్ బ్రాన్సన్‌కు జెఫ్ బెజోస్‌కు మధ్య తీవ్రపోటీ ఉంది.

మరో తొమ్మిది రోజులలో బెజోస్ స్పేస్ జర్నీ ఆరంభం అవుతుంది.దీనికి ముందుగా ఇప్పుడు బ్రాన్సన్ స్పేస్‌షిప్ ఆయనకు చెందిన వర్జిన్ గెలాక్‌స్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ నుంచి నింగిలోకి దూసుకు వెళ్లింది. దాదాపు 500 మంది తిలకిస్తూ ఉండ గా బ్రాన్సన్‌కు చెందిన ట్విన్ ఫుజలేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ బ్రాన్సన్ తోడుగా ఐదుగురితో వెళ్లింది. అంతరిక్షంలోని మానవులను ప్రయాణికులుగా తీసుకుని వెళ్లే తొలి ప్రయోగంగా ఈ సాహసం నిలుస్తుంది. 

ఇంతవరకూ భారత్ నుంచి రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, ఇండో అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లి వచ్చారు. ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తెలుగు అమ్మాయిగా శిరీష చరిత్రపుటల్లో నిలిచింది. ఇప్పటికే మూడుసార్లు స్పేస్ ఫైట్లను ప్రయోగించిన ఘనత వహించిన బ్రాన్సన్ కంపెనీ ఇప్పుడు మనుషులను రోదసీలోకి పంపించింది. రికార్డును తిరగరాసింది.

వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన యూనిటి వ్యోమనౌక యూనిటి 22ను విఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానానికి అమర్చారు. ఇది సాధారణ విమానంలాగానే ఆకాశంలోకి దూసుకువెళ్లి, తనకు అనుబంధంగా ఉన్న యూనిటి 22ను నేల నుంచి 13 కిలోమీటర్ల మీటర్ల ఎత్తు వరకూ చేర్చి జారవిడుస్తుంది. ఈ దశలో యూనిటి ఇంజన్ ప్రజ్వరిల్లుతుంది. వేగం పెరుగుతుంది.గంటకు 4వేల కిలోమీటర్ల వరకూ వేగం ఉంటుంది. 

దీనితో ఇది మరింత ఎత్తుకు దూసుకువెళ్లింది. భూమికి 90 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. భూమికి, రోదసీకి సరిహద్దుగా ఉండే కర్మాన్ రేఖను దాటి వెళ్లింది, అక్కడ వ్యోమగాములు భారరహిత స్థితికి కొద్దిసేపు లోనయ్యారు. నిర్ధేశిత ఎత్తుకు చేరిన తరువాత శూన్యస్థితిలో ఇంజిన్ రాకెట్ ఆగి, వ్యోమనౌక పయనం సాగింది.

త్వరలోనే తాము చేపట్టబోయే మరిన్ని అంతరిక్ష సుదీర్ఘకాలపు ప్రయాణాలకు ఇది కేవలం ఓ అడుగు అని, ఇది తనకు ఓ అందమైన సుదినం అని బ్రాన్సన్ ప్రయాణినికి ముందు చెప్పారు. వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ ద్వారా అంతరిక్ష ప్రయాణానికి వెళ్లడానికి ఇప్పటికే 600 మంది అత్యంత సంపన్నులు, సాహసవంతులు తమ పేర్లు రిజర్వ్ చేసుకున్నారు.

ఇప్పుడు బ్రాన్సన్ కంపెనీతో బెజోస్ బ్లూ ఒరిజిన్, బిలియనీరు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీలు టికెట్లను ఆఫర్ చేయలేదు. అయితే ఈ నెల 20న బెజోస్ అంతరిక్ష ప్రయాణం టెక్సాస్ నుంచి చేపడుతారు.