హీరో విజ‌య్‌కి మ‌ద్రాస్ హైకోర్టు చివాట్లు

రీల్ హీరోలకు ప‌న్నులు క‌ట్టాలంటే మ‌నసొప్ప‌డంలేద‌ని, వెనుకాముందు ఆడుతున్నార‌ని అంటూ త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలో అగ్ర‌శ్రేణి న‌టుడిగా వెలుగొందుతున్న హీరో విజ‌య్‌కి మ‌ద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. ఇంగ్లండ్ నుంచి తాను దిగుమ‌తి చేసుకున్న కారుకు ప‌న్ను మిన‌హాయింపు కోరుతూ 2012లో హీరో విజ‌య్ దాఖ‌లు చేసిన రిట్ పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది.

విజయ్ గా ప్రఖ్యాతి పొందిన సినీ హీరో సి. జోసెఫ్ విజయ్‌కి కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌, ఆడి ఏ8, బీఎండబ్ల్యు సిరీస్‌ 5, బీఎండబ్ల్యు 6, మినీ కూపర్‌ వంటి ఖరీదైన కార్లున్నాయి. 

వీటిలో రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. 

కేవలం తెరపైననే కాకుండా నిజ జీవితంలో కూడా `హీరో’ వలే వ్యవహరిస్తూ ఆ పన్ను కట్టమని హైకోర్టు ఎద్దేవా చేసింది. ఈ కేసు విచారించిన జస్టిస్ ఎస్ ఎం సుబ్రమణియన్ ఆ పన్ను బకాయిని రెండు వారాలలోపు చెల్లింపమని, కోర్ట్ విధించిన లక్ష రూపాయల జరిమానాను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లింపమని చెప్పింది. 

విజయవంతమైన సినీ నటుడైన విజయ్ కోర్ట్ కు సమర్పించిన తన అఫిడవిట్ లో తన వృత్తి ఏమిటో పేర్కొనకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.