పూరి రథయాత్ర నేడే… రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

భారీ భద్రత మధ్య, వరుసగా రెండో సంవత్సరం భక్తులు లేకుండా ఆలయ ప్రాంగంణంలోనే ప్రసిద్ధిచెందిన పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్రకు సకల సన్నాహాలు జరిగాయి. ఈ సందర్భంగా భక్తజన కోటికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 
 
ముఖ్యంగా ఒడిశాలోని భ‌క్తులంద‌రికీ రాష్ట్రపతి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌గ‌న్నాథుడి ఆశీర్వాదంతో.. దేశ ప్ర‌జ‌లంద‌రూ జీవితాంతం ఆనందంతో, ఆయురారోగ్యాల‌తో నిండి ఉండాల‌ని కోరుకుంటున్నానని రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ ప్రత్యక్ష సందర్భంగా ప్రధాని అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ పూరి జగన్నాధుడు ప్రజలు అందరికి ఆరోగ్యం, సౌభాగ్యం కలిగించగలరని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ‘జై జగన్నాధ’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు. 
 
క‌రోనా కార‌ణంగా జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌ను ఒడిశా ప్ర‌భుత్వం ఈ ఏడాది పూరీకే ప‌రిమితం చేసింది. గ‌తేడాది మాదిరిగానే భ‌క్తులు లేకుండా ర‌థ‌యాత్ర నేటి మధ్యాహ్న్నము 3 గంటలకు ప్రారంభం కానున్నది. 
 
సంప్రదాయ ప్రకారం దేవాలయ ప్రధాన కార్యనిర్వహణ అధికారి కృష్ణ కుమార్ పురిలోని జగద్గురు శంకరాచార్యుల వారిని కలసి రథయాత్ర ప్రారంభం సమయానికి వేంచేయమని ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం అంగీకరించారు. ఆరుగురు శిష్యులతో కలసి రథయాత్ర ప్రారంభంలో పాల్గొననున్నారు. 
 
ర‌థ‌యాత్ర నేప‌థ్యంలో పూరీలోని అన్ని దారుల‌ను మూసివేసి, రాక‌పోక‌ల‌ను ర‌ద్దు చేశారు. రేపు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు జిల్లా యంత్రాంగం పూరీలో క‌ర్ఫ్యూ విధించింది. పూరీలోకి ఇతర ప్రాంతాల నుంచి భ‌క్తులు రాకుండా ఉండేందుకు  ఒడిశా ప్ర‌భుత్వం క‌ర్ఫ్యూ విధించింది.
 
స్వామివారి ర‌థ‌యాత్ర‌కు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా ఒడిశా పోలీసులు ప‌టిష్ట‌మైన బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.  65 ప్లటూన్ల పోలీసులను మోహరింప చేశారు.   క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈసారి ర‌థ‌యాత్ర‌కు భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డంలేదు. కేవ‌లం అర్చ‌కులు, ఆల‌య సిబ్బంది మాత్ర‌మే ర‌థ‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు.
 
క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో భ‌క్తులంతా ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని, ఏ ఒక్క‌రూ కూడా ర‌థ‌యాత్ర‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు రావ‌ద్ద‌ని ఆల‌య ప్ర‌ధాన సేవ‌కులు కోరారు. ప్ర‌జలంతా ఎవ‌రి ఇండ్ల‌లో వాళ్లు ఉండి టీవీల ద్వారా ర‌థ‌యాత్ర‌ను వీక్షించాల‌ని జిల్లా కలెక్టర్ సామర్థ్ వర్మ ప్రజలకు  సూచించారు.
 
పూరికి చేరుకొని అన్ని రహదారులను మూసివేశారు. శ్రీ జగన్నాధ స్వామి దేవాలయం నుండి శ్రీ గుండుచ దేవాలయం వరకు 3 కిమీ వరకు గల రహదారిలో సహితం వైద్య అత్యవసరాలకు మినహా మరెవ్వరిని అనుమతించడం లేదు.