53 శాతం కరోనా కేసులు కేరళ, మహారాష్ట్ర నుంచే

దేశంలో గత వారం నమోదైన కరోనా కేసుల్లో 53 శాతం కేరళ (32 శాతం), మహారాష్ట్ర (21 శాతం) నుంచేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళలో 14 జిల్లాలు, మహారాష్ట్రలోని 15 జిల్లాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఈ జిల్లాలే ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కంటైన్‌మెంట్‌ చర్యలను పాటించాలని పేర్కొంది.

కరోనా మహమ్మారి అంతమవుతోందన్న భావనలో ఉండవద్దని ప్రజలకు సూచించింది. పర్యాటక ప్రాంతాల్లో పెరుగుతున్న జన రద్దీ, ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం చాలా ఆందోళన కలిగిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి నిర్లక్ష్యం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ను దేశం ఇప్పటికీ ఎదుర్కొంటోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. 80 శాతం కొత్త కేసులు 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 90 జిల్లాల్లో నమోదయ్యాయని చెప్పారు.

17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 66 జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ రేటు పది శాతానికిపైగా ఉందని పేర్కొన్నారు. దేశంలో లాంబ్డా వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే కరోనా ముగిసిందనే తప్పుడు నమ్మకంపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పారు. 

రష్యా, బ్రిటన్‌లో మరోసారి కరోనా విజృంభిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.