సెప్టెంబ‌ర్ నుంచి 12 ఏళ్లు నిండిన వారికి టీకాలు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌స్తుందని, అది పిల్ల‌ల‌పైనే ఎక్కువ‌గా ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఇది కాస్త ఊర‌ట క‌లిగించే విష‌య‌మే. సెప్టెంబ‌ర్ నుంచి 12-18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని నేష‌న‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ గ్రూప్ చీఫ్ ఎన్‌కే అరోరా వెల్ల‌డించారు.
 
జైడ‌స్ వ్యాక్సిన్‌నే వీరికి వేయ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న చెప్పారు. రానున్న వారాల్లో జైడ‌స్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు ల‌భిస్తాయ‌ని కూడా అరోరా తెలిపారు.కొవాగ్జిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఇవి సెప్టెంబ‌ర్ చివ‌రి నాటికి పూర్త‌వుతాయి.
అప్ప‌టికే వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని అనుకుంటున్నట్లు చెప్పారు. మూడో త్రైమాసికం లేదా వ‌చ్చే జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రిలోపు 2 నుంచి 18 ఏళ్ల‌లోపు వారికి వ్యాక్సిన్ ఇస్తాము. అయితే జైడ‌స్ క్యాడిలా వ్యాక్సిన్ మాత్రం 12-18 ఏళ్ల వారికి ఆలోపే అందుబాటులోకి వ‌స్తుంది అని అరోరా స్ప‌ష్టం చేశారు. స్కూళ్లను పునఃప్రారంభించ‌డం అన్న‌ది చాలా ముఖ్య‌మ‌ని, దీనిపై ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చిస్తున్న‌ట్లు తెలిపారు.
ఇలా ఉండగా, హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెటిరో కరోనా చికిత్సలో అత్యవసర వినియోగం కింద మోలినో ఫెరివిర్‌ వాడకానికి శుక్రవారం డీసీజీఏ  అనుమతి కోరింది. టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి రానున్న మోలినో ఫెరివిర్‌ 5 రోజుల్లో కరోనాను తగ్గిస్తుందని హెటిరో సంస్థ వెల్లడించింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ టాబ్లెట్ వలన కొవిడ్‌ బాధితులు కోలుకున్నారని హెటిరో తెలిపింది.
మోలినో ఫెరివిర్‌ అమెరికాలోని మెర్క్ షార్ప్ & డోహ్మ్ కార్పొరేషన్‌ సంయుక్తంగా  అభివృద్ధి చేస్తున్న  ఔషధం. ఈ ఏడాది ఏప్రిల్ లో, హెటిరో భారతదేశంలో మోలినో ఫెరివిర్‌ తయారీ, సరఫరా చేయడానికి మెర్క్ షార్ప్ & డోహ్మ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేజ్-3 ట్రయల్ తాత్కాలిక డేటా ప్రకారం ఈ టాబ్లెట్ వలన కోవిడ్‌ లక్షణాలతో తక్కవగా  ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపింది.