రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల‌పై ఎన్జీటీలో తెలంగాణ పిటిష‌న్

ఏపీ జ‌ల‌దోపిడీ చేస్తున్నదని అంటూ  తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేసింది. రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై తొలిసారిగా జాతీయ హ‌రిత ట్రిబ్యునల్,  చెన్నై ధ‌ర్మాస‌నాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆశ్ర‌యించింది. గ‌తంలో జారీ చేసిన‌ గ్రీన్ ట్రిబ్యున‌ల్ ఆదేశాల‌కు విరుద్ధంగా ఏపీ ప్ర‌భుత్వం ప‌నులు చేప‌డుతోంద‌ని ధిక్క‌ర‌ణ పిటిష‌న్‌ను తెలంగాణ స‌ర్కార్ దాఖ‌లు చేసింది. 
 
ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌, జ‌ల‌శ‌క్తి శాఖ‌, కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు నుంచి స‌రైన అనుమ‌తులు లేకుండానే రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌నులను ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది.కేఆర్‌ఎంబీ, పర్యావరణ, అటవీ అధికారులు, రాయలసీమ ఎత్తిపోతలను సందర్శించాలని గతంలో ఎన్జీటీ ఆదేశించింని గుర్తు చేసింది. 
 
అయితే,  అధికారులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ ఎత్తిపోత‌ల ప‌నుల‌ను ఎన్జీటీ బృందం సంద‌ర్శించాల‌ని కోరింది. ఎన్జీటీ బృందానికి హెలికాప్ట‌ర్, వాహ‌నాలు కూడా స‌మ‌కూరుస్తామ‌ని తెలంగాణ ప్ర‌భుత్వం తెలిపింది.
 
ఏపీ స‌ర్కార్‌పై చ‌ర్య తీసుకోకుండా త్రిస‌భ్య క‌మిటీ మీటింగ్ ఏర్పాటు చేయడాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఏపీ ఫిర్యాదుల‌ను మాత్ర‌మే చ‌ర్చిస్తామ‌న‌డం స‌రికాద‌ని తెలంగాణ పేర్కొంది.