పరమత సహనం భారతీయుల ఆత్మ

`పరమత సహనం భారతీయుల, భారతదేశ ఆత్మ’ అని అమెరికాకు చెందిన మేధో సంస్థ ‘ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌’ తాజా నివేదికలో పేర్కొన్నది. ‘భారతీయులు అన్ని మతాలను సమదృష్టితో గౌరవిస్తున్నారు. భారత్ లో మెజారిటీ ప్రజలు మతస్వేచ్ఛను అనుభవిస్తున్నారు’ అంటూ వెల్లడించింది. 2019 నవంబర్‌ నుంచి 2020 మార్చి మధ్యలో భారత్ లో  వివిధ మతాలకు చెందిన 30వేల మందిపై సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడిందింది. సర్వేలో భాగంగా 17 భాషల్లో, దేశంలోని అన్ని రాష్ట్రాలకు  చెందిన ప్రజలను ప్రశ్నలు అడిగారు. 

97 శాతం మంది భారతీయులు తాము దేవుణ్ని నమ్ముతున్నట్టు చెప్పారు. మత విశ్వాసాలు పాటించడంతో తాము పూర్తి స్వేచ్ఛను కలిగి ఉన్నామని అన్ని ప్రధాన మతాలకు చెందిన ప్రజలు చెప్పారు. హిందువుల్లో 77 శాతం మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు.

బీఫ్‌ తింటే హిందువు కాదని 72 శాతం మంది స్పష్టం చేశారు. దేవుణ్ని నమ్మకపోయినా, గుడికి వెళ్లకున్నా హిందువు కాదని 49 శాతం మంది తెలిపారు. తమ కుటుంబ వివాదాల పరిష్కారానికి మతపరమైన కోర్టులు ఉండాలని 74 శాతం మంది ముస్లింలు అభిప్రాయపడ్డారు.

భారత దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన్, సిఖ్, బుద్దిస్ట్ వంటి ఆరు మతాలకు చెందిన ప్రజలను, 17 భాషలకు చెందిన వారిని, దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇంటర్వ్యూ చేశారు. అన్ని మతాలకు చెందిన వారిలో అత్యధికంగా తాము పూర్తిగా మత స్వేచ్ఛ కలిగి ఉన్నామని స్పష్టం చేశారు. పైగా, మతం, తమ వ్యక్తిగత జీవనం విడిగా ఉండాలనే అభిలాషను వ్యక్తం చేశారు.

కాగా,  ఈ సర్వే ప్రకారం  వచ్చే నాలుగు దశాబ్దాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తే క్రైస్తవమే అతిపెద్ద మతంగా ఉంటుంది. ముస్లింల జనాభా రేటు వేగంగా పెరుగుతున్నది. ఇలాగే పెరిగితే 2050 నాటికి జనాభా 930 కోట్లకు పెరుగుతుంది. అప్పటికి ముస్లిం జనాభా 280 కోట్లు, క్రిస్టియన్‌ జనాభా 290 కోట్లు ఉండొచ్చని ప్యూ సర్వే పేర్కొన్నది.