భక్తులు లేకుండానే పూరీ జగన్నాథుడి రథయాత్ర

ఒడిశా పూరీలో జగన్నాథుడి రథయాత్ర ఈ ఏడాది భక్తులు లేకుండానే జరుగనుంది. రహదారిపై మార్గమధ్యలో ఇండ్ల, హోటళ్ల పైకప్పులపై నుంచి యాత్రను వీక్షించేందుకు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు ఆచారాలను చూసేందుకు అనుమతించమని చెప్పిన ప్రభుత్వం.. ఆ తర్వాత సడలింపులు ప్రకటించింది.

ఈ నెల 12న పూరీ పట్టణంలో జగన్నాథుడి రథయాత్ర జరుగనుండగా.. ఒక రోజు ముందు నుంచే.. యాత్ర మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పూరీ పట్టణంలో కర్ఫ్యూ విధించనున్నట్లు అధికారులు తెలిపారు.కరోనా మహమ్మారి కారణంగా వరుసగా రెండో సంవత్సరం భక్తులు లేకుండానే బలభద్ర, సుభద్ర, జగన్నాథుడి రథయాత్ర పండుగను నిర్వహిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ సమర్త్‌ వర్మ తెలిపారు.

టీవీల్లో కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు తెలిపారు. యాత్ర సందర్భంగా ఎస్పీ కేవీ సింగ్‌ పూరీ పట్టణంలో మూడు కిలోమీటర్ల పొడవున పర్యటించి రథయాత్ర సన్నాహాలను పరిశీలించారు. రహదారి పొడవున రోడ్లకు ఇరువైపులా 230 నివాస గృహాలు, 41 హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయని తెలిపారు. యాత్రను ఆయా భవనాలపై నుంచి వీక్షించొచ్చని చెప్పారు.

అయితే, యాత్ర సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే హోటళ్లలో బుకింగ్‌లు నిలిపివేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.పండుగకు ముందే పూరీకి వచ్చే రోడ్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భక్తులెవరూ పూరీకి రావొద్దని కోరారు.

కాగా, ఈ సారి రథాలను లాగేందుకు కొవిడ్‌ నెగెటివ్‌ సర్వీసర్లను మాత్రమే అనుమతించనున్నట్లు టెంపుల్‌ అడ్మినిస్ట్రేటర్‌ క్రిషన్‌కుమార్‌ స్పష్టం చేశారు. రథాలను లాగడానికి ఉపయోగించే తాడులను తాకడానికి పోలీసు సిబ్బందిని, అధికారులను అనుమతించరని తెలిపారు. రథాలను లాగే సేవలకు శానిటైజర్లు, మాస్క్‌లు, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.