గోమ‌తి న‌ది ప్రాజెక్టులో అవినీతి.. 40 చోట్ల సీబీఐ దాడులు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని గోమ‌తి న‌ది ఆధునీక‌ర‌ణ కోసం గ‌త ప్ర‌భుత్వం రూ  1500 కోట్ల‌తో ప్రాజెక్టును చేప‌ట్టింది. ఆ స‌మ‌యంలో యూపీ ముఖ్యమంత్రిగా  అఖిలేశ్ యాద‌వ్ ఉన్నారు. అయితే ఆ ప్రాజెక్టులో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల విష‌యంలో ఇప్ప‌టికే ఒక కేసు న‌మోదు అయ్యింది. 

తాజాగా ఆ ప్రాజెక్టుకు చెందిన రెండ‌వ కేసును సీబీఐ న‌మోదు చేసింది. ఆ కేసులో అఖిలేశ్ పేరు లేకున్నా, ఇవాళ సీబీఐ అధికారులు 42 ప్ర‌దేశాల్లో సోదాలు నిర్వ‌హిస్తున్నారు. యూపీతో పాటు రాజ‌స్థాన్‌, కోల్‌క‌తాలోనూ దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

యుపిలో నోయిడా, ఘజియాబాద్, బులంద్సర్, రాయబేరాలి లలో దాడులు జరుగుతున్నాయి. శుక్రవారమే 190 మందిపై కేసు నమోదు చేశారు. ఫ్రాన్స్ కంపెనీ అక్వాటిక్ షోపై ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖ‌లైంది. గోమ‌తి న‌దిపై ల‌క్నోలో ఆధునీక‌ర‌ణ కోసం అక్వాటిక్ షో కంపెనీ అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. దీని కోసం 55.95 ల‌క్ష‌ల యూరోల ఒప్పందం కుద‌ర్చుకున్నారు.

2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ అవినీతి ఆరోపణలపై న్యాయ విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్జ్ అలోక్ కుమార్ సింగ్ జరిపిన విచారణలో ఒక దివాళా స్థితిలో ఉన్న కంపెనీకి టెండర్ ను కట్టబెట్టినందుకు టెండర్ నిబంధనలను మార్చివేశారని విచారణలో వెల్లడైనది. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ప్రాజెక్టును అక్వాటిక్ షోకు అప్పగించిన్నట్లు నిర్ధారించారు.

ఈ కమీషన్ నివేదికను జతపరుస్తూ తదుపరి విచారణ జరిపామని కోరుతూ యోగి ప్రభుత్వం మే, 2017లో  సిబిఐకి లేఖ వ్రాసింది. రాష్ట్రానికి చెందిన ఇరిగేష‌న్ శాఖ అవినీతికి పాల‌ప‌డిన ఆరోప‌ణ‌లు ఉన్న నేపథ్యంలో సీబీఐ ఆ రెండు కేసుల‌ను విచారిస్తున్న‌ది.

రాష్ట్ర నీటిపారుదల శాఖలో మాజీ ఇంజినీర్లు, సూపరింటెండెంట్ ఇంజినీర్లతో పాటు కొందరు ప్రైవేట్ కాంట్రాక్టర్లను నిందితులుగా ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ నాదీ ప్రవాహక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతూ చాలా మంది పర్యావరణవేత్తలు అప్పట్లోనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ఏడాది ఈ కేసుకు సంబంధించి ఇద్దరినీ సిబిఐ అరెస్ట్ చేసింది. అవినీతి సొమ్ము ఏ విధంగా చేతులు మారిందో తాము సాక్ష్యాలు సేకరించామని సిబిఐ వర్గాలు తెలిపారు.