ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు ఎఫ్ సి ఆర్ ఎ  లైసెన్స్ పై ఫిర్యాదు 

ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు ఎఫ్ సి ఆర్ ఎ  లైసెన్స్ పై ఫిర్యాదు 
దేశంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించే పేరిట పనిచేస్తున్న “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థకు  కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలు పొందేందుకు వీలుగా FCRA లైసెన్స్ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది.
‘ఎల్లలు లేని వైద్యులు’గా తమను తాము అభివర్ణించుకునే  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థ అధికంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లోని సరిహద్దులు, దట్టమైన గిరిజన ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన విదేశీ డాక్టర్లు సైతం సుదూర గిరిజన ప్రాంతాల్లోకి అలవోకగా వెళ్లి సేవలందిస్తారనే పేరుంది. అయితే ఈ సంస్థ మావోయిస్టులకు వైద్య సహాయ, సదుపాయాలు కల్పిస్తోందని గతంలో దంతెవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక ఎంకౌంటర్ అనంతరం పోలీసులు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్న డంపులో ఈ సంస్థకు చెందిన వైద్య పరికరాలు, మందులు లభ్యమయ్యాయి. వీటి ఫలితంగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం 2007లో  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్”  కార్యకలాపాలపై నిషేధం విధించింది.
అంతేకాకుండా  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్”కు చెందిన విదేశీ డాక్టర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం భార‌త దేశ వీసా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం క్రిందకు వస్తుందని, ఇటువంటి వివాదాస్పద సంస్థకు FCRA లైసెన్స్ మంజూరు చేస్తే అది దుష్పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో పునరాలోచించి, లైసెన్సును రద్దు చేయాలనీ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోం మంత్రిని కోరింది.