త్వ‌ర‌లో ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌ను క‌ట్ట‌డి చేస్తాం

ఈ-కామ‌ర్స్ బిజినెస్‌లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల (ఎఫ్‌డీఐ) విష‌య‌మై త్వ‌ర‌లో కేంద్రం స్పష్టత ఇస్తుంద‌ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు. ఈ-కామ‌ర్స్ ప‌రిశ్ర‌మ‌లోని కొన్ని సంస్థ‌లు.. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నాయ‌న్న ఫిర్యాదులు వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు డిపార్ట్‌మెంట్ ఫ‌ర్ ప్ర‌మోష‌న్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అండ్ ఇంట‌ర్న‌ల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తెలిపింది.

ఎఫ్‌డీఐ పాల‌సీని కొన్ని సంస్థ‌లు పూర్తిగా పాటించ‌డం లేద‌ని త‌మ ద్రుష్టికి వచ్చింద‌ని పీయూష్ గోయ‌ల్ చెప్పారు. అయితే, ఎఫ్‌డీఐ పాల‌సీని స‌వ‌రించ‌బోమ‌ని స్పష్టం చేశారు. ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాలైన‌ ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు.. ప్రిఫ‌రెన్షియ‌ల్ సెల్ల‌ర్స్‌ను ప్రోత్స‌హిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను ప్ర‌భావితం చేస్తున్నాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్ సంస్థ‌లు ప‌లు యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీస్‌ల‌ను అమ‌లు చేస్తున్నాయ‌ని దేశీయ ట్రేడ‌ర్ల సంఘాలు గ‌త కొన్నేండ్లుగా ఫిర్యాదు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని దేశీయ ట్రేడ‌ర్లు కోరుతున్నారు. అయితే, ఈ -కామ‌ర్స్ సంస్థ‌ల ఆగ‌డాల‌ను అరిక‌ట్టేందుకు 2018లో స్పష్టత ఇచ్చినా ఆయా కంపెనీలు దేశీయ చ‌ట్టాల నుంచి త‌ప్పించుకుంటున్నాయి.

వినియోగ‌దారుల ప‌రిర‌క్ష‌ణ చ‌ట్టం కింద ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఈ-కామ‌ర్స్ నిబంధ‌న‌ల్లోనే వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఎఫ్‌డీఐ పాల‌సీ, ఈ-కామ‌ర్స్ పాల‌సీ క‌లిసి ఉన్నాయ‌ని శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ మీడియా స‌మావేశంలో పీయూష్ గోయ‌ల్ తెలిపారు.

ఈ-కామ‌ర్స్ కంపెనీల‌ను మ‌రిత జ‌వాబుదారి చేయ‌డంతోపాటు వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కు  కన్జూమ‌ర్ ప్రొటెక్ష‌న్ రూల్స్‌లో మార్పులు తెస్తూ గ‌త నెల‌లో ప్ర‌తిపాద‌న‌లు రూపొందించింది కేంద్రం. ఈ ప్ర‌తిపాద‌న‌ల‌పై అన్ని వాటా దారులు ఈనెల 6వ తేదీ లోపు అభిప్రాయాలు తెలుపాల‌ని కోరింది.