వన్‌ నేషన్‌.. వన్‌ రేషన్‌…. `సుప్రీం’ డెడ్‌లైన్‌

ఒకే దేశం ఒకే రేష‌న్ కార్డు (వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్‌) స్కీమ్‌ను అన్ని రాష్ట్రాలు అమ‌లు చేయాల‌ని ఇశాళ సుప్రీంకోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. దానికి జూలై 31వ తేదీని డెడ్‌లైన్‌గా ఫిక్స్ చేసింది. వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు విధానం ద్వారా.. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రేష‌న్ కార్డు ఉన్న వ్య‌క్తి స్థానికంగా సబ్సిడీ ఆహార‌ధాన్యాలు తీసుకునే వీలు ఉంటుంది. 

జ‌స్టిస్ అశోక్ భూష‌న్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కేంద్ర ప్ర‌భుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. వ‌ల‌స కూలీలు, అసంఘ‌టిత కార్మికుల రిజిస్ట్రేష‌న్ కోసం ఓ జాతీయ వెబ్‌సైట్‌ను రూపొందించాల‌ని కోరింది. జూలై 31వ తేదీ లోగా ఆ పోర్ట‌ల్ అందుబాటులోకి రావాల‌న్న‌ది. 

అన్ని రాష్ట్రాల వ‌ల‌స కార్మికులకు రేష‌న్ జారీ చేయాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. క‌మ్యూనిటీ కిచెన్‌ల‌ను కూడా నిర్వ‌హించి.. కోవిడ్ మ‌హ‌మ్మారి వేళ ఎవ‌రూ ఆక‌లితో ఉండ‌కూడ‌ద‌ని కోర్టు చెప్పింది. రైట్ టు ఫుడ్ అనేది ప్రాథ‌మిక హ‌క్కు అని కోర్టు త‌న తీర్పులో గుర్తు చేసింది. 

ఆహార భ‌ద్ర‌త అనేది పోర్ట‌బుల్‌గా మారింద‌ని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఐశ్వ‌ర్య భాటి ఇవాళ కోర్టుకు వెల్ల‌డించారు. వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్‌కార్డుతో ఇది సాధ్య‌మైంద‌న్నారు. వ‌ల‌స కూలీల కోసం ఈ స్కీమ్‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. దేశంలో ఉన్న అన్ని చౌక‌ధ‌ర దుకాణాల నుంచి రేష‌న్ కార్డుతో.. బయోమెట్రిక్ విధానంలో రేష‌న్ తీసుకునే వెస‌లుబాటు క‌ల్పించిన‌ట్లు కోర్టుకు కేంద్రం విన్న‌వించింది. 

32 రాష్ట్రాల‌కు చెందిన నేష‌న‌ల్ ఫుడ్ సెక్యూర్టీ యాక్ట్‌లోని 69 కోట్ల మంది ల‌బ్ధిదారుల్ని వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్‌కార్డు ప‌రిధిలోకి తెచ్చిన‌ట్లు భాటి తెలిపారు.