భారత ఆర్థిక వ్యవస్థ రూ.6,28,993 కోట్ల ఉద్దీపన ప్యాకేజి

కోవిడ్‌-19 రెండో విడ‌త వైర‌స్ కార‌ణంగా ప్ర‌భావిత‌మైన భిన్న రంగాల‌కు స‌హాయం అందించే ప‌లు చ‌ర్య‌లు సోమ‌వారం ఆర్థిక‌, కార్పొరేట్ వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ల‌ను అత్య‌వ‌స‌ర స్పంద‌న‌కు స‌మాయ‌త్తం చేయ‌డంతో పాటు వృద్ధికి, ఉపాధి క‌ల్ప‌న‌కు కూడా ఈ చ‌ర్య‌లు ఊతం ఇస్తాయి. ఆర్థిక‌, కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్‌, ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ టివి సోమ‌నాథ‌న్‌, డిఎఫ్ఎస్ కార్య‌ద‌ర్శి శ్రీ దేబ‌శిష్ పాండా, రెవిన్యూ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ త‌రుణ్ బ‌జాజ్ కూడా ఉద్దీప‌న చ‌ర్య‌ల ప్ర‌క‌ట‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ప్ర‌క‌టించిన మొత్తం 17 చ‌ర్య‌ల విలువ రూ.6,28,993 కోట్లు. గ‌తంలో ప్ర‌క‌టించిన రెండు చ‌ర్య‌లు – డిఏపి, పికె ఎరువుల‌కు అద‌న‌పు స‌బ్సిడీ, ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ అన్న యోజ‌న (పిఎంజికెఏవై) ప‌థ‌కం 2021 మే నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు పొడిగింపు – సైతం ఉన్నాయి.

I. మ‌హ‌మ్మారి ప్ర‌భావిత రంగాల‌కు ఆర్థిక స‌హాయం

ప్ర‌క‌టించిన 17 ప‌థ‌కాల్లో 8 ప‌థ‌కాలు కోవిడ్‌-19 ప్ర‌భావానికి గురైన ప్ర‌జ‌లు, వ్యాపారాల‌కు ఆర్థిక స‌హాయం అందించేవి కావ‌డం విశేషం. ఆరోగ్య రంగంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డంతో పాటు ప‌ర్యాట‌కం, టూరిజం రంగాల పున‌రుజ్జీవానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.

i. కోవిడ్ ప్ర‌భావిత రంగాల‌కు రూ.1.10 కోట్ల రుణ గ్యారంటీ ప‌థ‌కం

ఈ కొత్త ప‌థ‌కంకింద వ్యాపార సంస్థ‌ల‌కు అద‌నంగా రూ.1.1 ల‌క్ష‌ల కోట్ల అద‌న‌పు రుణ ప‌ర‌ప‌తి అందుబాటులోకి వ‌స్తుంది. ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు, ప‌ర్యాట‌కం స‌హా ఇత‌ర రంగాల‌కు రూ.60 వేల కోట్లు ఇందులో భాగంగా ఉన్నాయి.

ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగానికి ప్ర‌క‌టించిన చ‌ర్య‌లు ఇంత‌వ‌ర‌కు వైద్య వ‌స‌తులు లేని ప్రాంతాల్లో వైద్య మౌలిక వ‌స‌తులు పెంచ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి. 8 మెట్రోపాలిట‌న్ న‌గ‌రాలు కాకుండా ఇత‌ర న‌గ‌రాల‌కు ఆరోగ్య‌/ వైద్య మౌలిక వ‌స‌తుల విస్త‌ర‌ణ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల‌కు ఈ రుణ గ్యారంటీ వ‌ర్తిస్తుంది. విస్త‌ర‌ణ ప్రాజెక్టుల‌కు 50%, కొత్త ప్రాజెక్టుల‌కు 75% రుణ హామీ ల‌భిస్తుంది. ఆకాంక్షాపూరిత జిల్లాలైతే విస్త‌ర‌ణ‌, కొత్త ప్రాజెక్టులు రెండింటికీ 75% రుణ హామీ ల‌భిస్తుంది. ఈ ప‌థ‌కం కింద గ‌రిష్ఠ రుణం రూ.100 కోట్లు కాగా రుణ గ్యారంటీ కాల‌ప‌రిమితి 3 సంవ‌త్స‌రాలు. ఈ రుణాల‌పై బ్యాంకులు గ‌రిష్ఠంగా ఏడాదికి 7.95% వ‌డ్డీరేటు వ‌సూలు చేయ‌వ‌చ్చు. ఆరోగ్య రంగం కాకుండా ఇత‌ర రంగాల‌కు అందించే రుణాల‌పై గ‌రిష్ఠ వ‌డ్డీ ప‌రిమితి ఏడాదికి 8.25% ఉంటుంది. గ్యారంటీ ర‌హిత రుణాల‌పై వ‌సూలు చేస్తున్న 10-11% వ‌డ్డీక‌న్నా కూడా ఈ ప‌థ‌కాల కింద అందించే రుణాల‌పై వ‌డ్డీ చాలా త‌క్కువ‌.

ii. అత్య‌వ‌స‌ర రుణ గ్యారంటీ ప‌థ‌కం (ఇసిఎల్ జిఎస్‌)

ఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజిలో భాగంగా 2020 మే నెల‌లో ప్ర‌క‌టించిన అత్య‌వ‌స‌ర రుణ హామీ ప‌థ‌కం (ఇసిఎల్ జిఎస్‌) కింద మ‌రో రూ.1.5 ల‌క్ష‌ల కోట్లు కేటాయించారు. ఇసిఎస్ జిఎస్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. రూ.2.73 ల‌క్ష‌ల కోట్లు ఈ ప‌థ‌కం కింద మంజూరు చేయ‌గా ఇప్ప‌టికే రూ.2.10 కోట్లు పంపిణీ చేశారు. విస్త‌రించిన ఈ ప‌థ‌కం కింద గ‌తంలో తీసుకున్న ఒక్కో రుణంలో చెల్లించాల్సిన మొత్తంలో 20 శాతం మొత్తం అద‌న‌పు రుణ గ్యారంటీ, రుణం అంగీక‌రించారు. రంగాల‌వారీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా వివ‌రాల‌కు తుదిరూపం ఇస్తారు. ఆ ర‌కంగా మొత్తం రుణ‌గ్యారంటీ ప‌రిమితిని రూ.3 ల‌క్ష‌ల కోట్ల నుంచి రూ.4.5 ల‌క్ష‌ల కోట్ల‌కు పెంచారు.

iii. మైక్రో ఫైనాన్స్ సంస్థలకు రుణ గ్యారంటీ పథకం

ఇది పూర్తిగా కొత్త ప‌థ‌కం. మైక్రో ఫైనాన్స్ సంస్థ‌ల నెట్ వ‌ర్క్ లో అతి చిన్న రుణ‌గ్ర‌హీత‌ల ప్ర‌యోజ‌నం కోసం దీన్ని ప్ర‌క‌టించారు. కొత్త లేదా పాత ఎన్ బిఎఫ్ సిలు-ఎంఎఫ్ఐలు లేదా ఎంఎఫ్ఐల‌కు అందించే రూ.1.25 ల‌క్ష‌ల నుంచి రూ.25 ల‌క్ష‌ల రుణం అందించేందుకు షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకుల‌కు ఈ గ్యారంటీ ఇస్తారు. బ్యాంకుల నుంచి అందించే రుణాల‌పై వ‌డ్డీ ప‌రిమితిని ఎంసిఎల్ఆర్ పై 2 శాతంగా నిర్ణ‌యించారు. రుణ గ‌రిష్ఠ కాల‌ప‌రిమితి 3 సంవ‌త్స‌రాలు. 80% స‌హాయాన్ని ఎంఎఫ్ఐలు అద‌న‌పు రుణ స‌హాయంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఆర్ బిఐ నిర్దేశించిన గ‌రిష్ఠ వ‌డ్డీలో 2% దిగువ‌న వ‌డ్డీరేటు ఉంటుంది. పాత రుణాల‌పై తిరిగి చెల్లింపున‌కు కాకుండా కొత్త రుణాల పైనే ఈ ప‌థ‌కం కేంద్రీక‌రిస్తారు. ఆర్ బిఐ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు లోబ‌డి జెఎల్ జిలో స‌భ్యులైన రుణ సంస్థ‌లు, రుణ‌గ్ర‌హీత‌లకు గృహాల వారీ ఆదాయం, రుణాల‌పై విధించిన ప‌రిమితికి లోబ‌డి ఇది వ‌ర్తిస్తుంది. ఇప్ప‌టికే రుణాలు తీసుకున్న వారు (89 రోజుల వ‌ర‌కు రుణ చెల్లింపులు బ‌కాయిలో ఉన్న వారు స‌హా) కూడా దీనికి అర్హులు కావ‌డం ఈ ప‌థ‌కం ప్ర‌ధాన ల‌క్ష‌ణం. ఎంఎఫ్ఐలు/ ఎన్ బిఎఫ్ సిలకు ఎంఎల్ఐలు అందించే రుణాల‌పై 2022 మార్చి 31 వ‌ర‌కు లేదా గ‌రిష్ఠంగా రూ.7,500 కోట్ల మొత్తం వ‌ర‌కు ఏది ముందు పూర్త‌యితే అంత‌వ‌ర‌కు ఈ గ్యారంటీ వ‌ర్తిస్తుంది. అలాగే నేష‌న‌ల్ క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్టీ కంపెనీ (ఎన్ సిజిటిసి) ద్వారా 3 సంవ‌త్స‌రాల కాలానికి 75% డీఫాల్ట్ మొత్తంపై రుణ హామీ ల‌భిస్తుంది.

ఈ ప‌థ‌కం కింద ఎన్ సిజిటిసి ఎలాంటి గ్యారంటీ ఫీజు వ‌సూలు చేయ‌దు.

iv. టూరిస్టు గైడ్ లు/ ఇత‌ర భాగ‌స్వాముల కోసం ప‌థ‌కం

ప‌ర్యాట‌క రంగంలో ప‌ని చేసే వారికి ఊర‌ట క‌ల్పించే మ‌రో కొత్త ప‌థ‌కం కూడా ప్ర‌క‌టించారు. కోవిడ్ ప్ర‌భావిత రంగాల‌కు ఈ కొత్త‌రుణ గ్యారంటీ ప‌థ‌కం కింద వ‌ర్కింగ్ క్యాపిట‌ల్ అవ‌స‌రాలు/ వ్య‌క్తిగ‌త రుణాలు అందిస్తారు. ఆయా రంగాల వారు త‌మ‌పై గ‌ల బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించుకుని కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌భావిత‌మైన వ్యాపారాలు పునః ప్రారంభించేందుకు ఇది స‌హాయ‌ప‌డుతుంది. ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ గుర్తించిన, రాష్ట్ర ప్ర‌భుత్వాలు గుర్తించిన‌ 10,700 మంది ప్రాంతీయ టూరిస్టు గైడ్ ల‌కు; ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ గుర్తించిన‌ ప‌ర్యాట‌కం, టూరిస్టు రంగాల్లోని వెయ్యి మంది భాగ‌స్వాముల‌కు (టిటిఎస్‌) ఈ స్కీమ్ వ‌ర్తిస్తుంది. గ‌రిష్ఠంగా టిటిఎస్ కు రూ.10 ల‌క్ష‌లు, ఒక్కో టూరిస్టు గైడ్ కు రూ.1 ల‌క్ష రుణం ల‌భిస్తుంది. ఈ రుణాల‌పై ప్రాసెసింగ్ ఫీజు ఉండ‌దు. ముంద‌స్తుగా రుణ ఖాతా మూసివేసిన‌/ చెల్లించిన స‌మ‌యంలో ఎలాంటి చార్జీలు వ‌సూలు చేయ‌రు. అలాగే అద‌న‌పు హామీలు కూడా అవ‌స‌రం లేదు. ఎన్ సిజిటిసి ద్వారా ప‌ర్యాట‌క మంత్రిత్వ శాఖ ఈ ప‌థ‌కం నిర్వ‌హిస్తుంది.

v. 5 ల‌క్ష‌ల మంది ప‌ర్యాట‌కులు ఒక నెల ఉచిత టూరిస్టు వీసా

టూరిజం రంగాన్ని ఉత్తేజితం చేయ‌డానికి ఉద్దేశించిన కొత్త ప‌థ‌కం ఇది. ఒక సారి వీసాల జారీ ప్రారంభించిన త‌ర్వాత దేశానికి వ‌చ్చే తొలి 5 ల‌క్ష‌ల మంతి ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత వీసాలు జారీ చేస్తారు. అయితే ఒక్కో ప‌ర్యాట‌కునికి ఒక్క‌సారి మాత్ర‌మే ఈ ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది. 2022 మార్చి 31 వ‌ర‌కు లేదా 5 ల‌క్ష‌ల వీసాలు పూర్త‌య్యే వ‌ర‌కు ఏది ముందు పూర్త‌యితే అంత‌వ‌ర‌కు ఈ స‌దుపాయం అందుబాటులో ఉంటుంది. ప్ర‌భుత్వంపై ఈ స్కీమ్ భారం రూ.100 కోట్ల వ‌ర‌కు ఉంటుంది.

vi. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ రోజ్ గార్ యోజ‌న (ఎఎన్ బిఆర్ వై) విస్త‌ర‌ణ‌

2020 అక్టోబ‌ర్ 1వ తేదీన ఈ ప‌థ‌కం ప్రారంభించారు. కొత్త ఉద్యోగాల క‌ల్ప‌న‌కు, న‌ష్ట‌పోయిన ఉద్యోగాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు ఇపిఎఫ్ఓ ద్వారా యాజ‌మాన్యాల‌కు ఈ ప్రోత్సాహం అందిస్తారు. వెయ్యి మంది క‌న్నా త‌క్కువ‌ ఉద్యోగులుండే సంస్థ‌ల‌కు న‌నెల‌కి రూ.15,000 క‌న్నా త‌క్కువ వేత‌నం పొందే ఉద్యోగుల రిజిస్ర్టేష‌న్ పై రెండు సంవ‌త్స‌రాల కాలానికి య‌జ‌మాని, ఉద్యోగి వాటాపై (వేత‌నంలో 24 శాతం) స‌బ్సిడీ అందిస్తారు. వెయ్యి మందికి పైబ‌డిన ఉద్యోగులుండే సంస్థ‌ల‌కు యాజ‌మాన్యం వాటా 12% అనుమ‌తిస్తారు. 2021 జూన్ 18 వ‌ర‌కు 79,577 సంస్థ‌ల‌కు ఈ ప‌థ‌కం కింద రూ.902 కోట్ల ప్ర‌యోజ‌నం ల‌భించింది. ఈ స్కీమ్ కింద రిజిస్ర్టేష‌న్ కాల‌ప‌రిమితి 2021 జూన్ 30 నుంచి 2022 మార్చి 31 వ‌ర‌కు ఉంటుంది.

vii. డిఏపి, పికె ఎరువుల‌కు అద‌న‌పు స‌బ్సిడీ

డిఏపి, పికె ఎరువుల‌కు అద‌న‌పు స‌బ్సిడీని ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. వాటి వివ‌రాలు కూడా పొందుప‌రిచారు. 2020-21 సంవ‌త్స‌రానికి కేటాయించిన ఎన్ బిఎస్ స‌బ్సిడీని రూ.27,500 నుంచి రూ.42,275 కోట్ల‌కు పెంచారు. ఆ ర‌కంగా రైతులు రూ.14,775 కోట్ల అద‌న‌పు ప్ర‌యోజ‌నం పొందారు. ఇందులో రూ.9,125 కోట్లు డిఏపికి అద‌న‌పు స‌బ్సిడీ కాగా ఎన్ పికెకి అద‌న‌పు స‌బ్సిడీ రూ.5,650 కోట్లుంది.

viii. ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌న (పిఎంజికెవై) కింద 2021 మే నుంచి న‌వంబ‌రు వ‌ర‌కు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం వ‌ల్ల ఏర్ప‌డిన ఆర్థిక అంత‌రాయాల కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న పేద‌ల కోసం ప్ర‌క‌టించిన పిఎంజికెవై కింద గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1,33,972 కోట్లు ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. తొలుత 2020 ఏప్రిల్-జూన్ నెల‌ల మ‌ధ్య కాలానికి ఈ స్కీమ్ ను ప్ర‌క‌టించారు. అయితే పేద‌ల‌కు మ‌రింత‌గా మ‌ద్ద‌తు అందించాల్సిన అవ‌స‌రం గుర్తించిన ప్ర‌భుత్వం స్కీమ్ ను 2020 న‌వంబ‌ర్ వ‌ర‌కు విస్త‌రించింది. కోవిడ్‌-19 రెండో విడ‌త కార‌ణంగా పేద‌లు/ నిరాద‌ర‌ణ‌కు గుర‌వుతున్న వ‌ర్గాల కోసం ఈ ప‌థ‌కం 2021 మే నెల‌లో పునః ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ఎన్ఎఫ్ఎస్ఏ ల‌బ్ధిదారుల‌కు 2021 మే నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ప్ర‌తీ నెలా 5 కెజిల ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తారు. ప్ర‌భుత్వంపై ఈ స్కీమ్ భారం రూ.93,869 కోట్లుంటుంది. త‌ద్వారా మొత్తం పిఎంజికెవై వ్య‌యం రూ.2,27,841 కోట్ల‌కు పెరిగింది.

2. ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ బ‌లోపేతం

పిల్ల‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటూనే ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ బ‌లోపేతానికిగాను అద‌నంగా రూ. 23, 220 కోట్ల కేటాయింపు.

రుణ గ్యారంటీ ప‌థ‌కం ద్వారా ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేస్తూనే ప్ర‌జారోగ్య మౌలిక స‌దుపాయాల‌ను, మాన‌వ‌వ‌న‌రుల‌ను బ‌లోపేతం చేయ‌డానికిగాను రూ. 23, 220 కోట్ల నిధుల‌ను కూడా ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఈ నూత‌న ప‌థ‌కంద్వారా చిన్నారుల ఆరోగ్యభ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తూ స్వ‌ల్ప‌కాలిక అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందివ్వ‌డం జ‌రుగుతుంది. ఇందుకోసం కేటాయించిన రూ. 23, 220 కోట్ల‌ను ఈ ఆర్ధిక సంవ‌త్స‌రంలో ఖ‌ర్చు చేయ‌డం కోస‌మే కేటాయించ‌డం జ‌రిగింది. ఈ ప‌థకం కింద అందుబాటులోకి వ‌చ్చే నిధుల‌తో స్వ‌ల్ప‌కాలిక మాన‌వ‌న‌రుల బలోపేతం జ‌రుగుతుంది. ఈ ప‌నిని వైద్య విద్యార్థులు ( ఇంట‌ర్న్స్‌, రెసిడెంట్లు, వైద్య విద్య చివ‌రి సంవ‌త్స‌ర విద్యార్థులు), న‌ర్సింగ్ విద్యార్థుల ద్వారా చేయ‌డం జ‌రుగుతుంది. అంతే కాదు ఐసియు ప‌డ‌క‌ల సంఖ్య‌ను పెంచ‌డం జ‌రుగుతుంది. అన్ని స్థాయిల్లో ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను అందుబాటులోకి తెస్తారు. ప‌రికారాలు, మందుల అందుబాటు పెరుగుతుంది. టెటీ వైద్యం అందుబాటు పెరుగుతుంది. అంబులెన్స్ సేవ‌లు బ‌లోపేత‌మ‌వుతాయి. ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని, త‌ద‌నుగుణ‌మైన ప‌రీక్ష‌లను పెంచ‌డం జ‌రుగుతుంది. ప‌ర్య‌వేక్ష‌ణ సామ‌ర్థ్యాన్ని బ‌లోపేతం చేయ‌డానికి, జెనోమ్ సీక్వెన్సింగ్‌కోసం కూడా ఈ నిధుల‌ను ఉప‌యోగిస్తారు.

3. ఆర్ధిక వృద్ధి, ఉపాధి క‌ల్ప‌న కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న ప్ర‌భుత్వం. ఇందుకోసం కింద తెలియజేసిన 8 ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది.

  1.వాతావ‌ర‌ణ ప్ర‌తికూల‌త‌ల‌ను ఎదుర్కొనడానికిగాను ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలుగ‌ల వెరైటీ వంగ‌డాల‌ విడుద‌ల‌

గ‌తంలో అత్య‌ధిక ఉత్ప‌త్తి పంట ర‌కాల‌ను అభివృద్ధి చేసిన‌ప్పుడు పౌష్టిక సామ‌ర్థ్యం, ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కొనే ర‌కాలను అభివృద్ధి చేయ‌డానికి ప్రాధాన్య‌త వుండేది కాదు. అంతే కాదు ఈ ర‌కాల్లో ఆశించిన స్థాయికంటే త‌క్కువ స్థాయిలో ప్ర‌ధాన‌మైన పౌష్టిక‌ప‌దార్థాలు వుండేవి. అవి బ‌యోటిక్ , అబ‌యోటిక్ ఒత్తిళ్ల‌కు గుర‌య్యేవి. ఈ నేప‌థ్యంలో ఐసిఏఆర్ అభివృద్ధి చేసిన బ‌యో ఫోర్టిఫైడ్ పంట వెరైటీలు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. వీటిలో ప్రోటీన్, ఐరన్‌, జింక్‌, విట‌మిన్ ఏ లాంటి పౌష్టిక ప‌దార్థాలు అత్య‌ధికంగా వున్నాయి. వ్యాధుల‌ను, పురుగుల‌ను, క్రిమికీట‌కాల‌ను, క‌రువు ప‌రిస్థితుల‌ను,నీటిలో ఉప్పు శాతాన్ని, వ‌ర‌ద‌ల‌ను ఎదుర్కొనే సామ‌ర్థ్యం ఈ నూత‌న వంగ‌డాల స్వంతం. అంతే కాదు ఇవి త‌క్కువ కాలంలోనే అందుబాటులోకి వ‌స్తాయి. పంట కోత‌ల్ని యంత్రాల‌ద్వారా చేయ‌వ‌చ్చు. ధాన్యం, బ‌ఠానీలు, చిరు ధాన్యాలు, మొక్క‌జొన్న‌, సోయాబీన్‌, కినోవా, బ‌క్వీట్‌, బీన్స్‌, జొన్న‌లు మొద‌లైన 21 ర‌కాల నూత‌న వంగ‌డాల‌ను జాతికి అంకితం చేయ‌డం జరుగుతుంది.

2 .ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ వ్య‌వ‌సాయ మార్కెట్ కార్పొరేష‌న్ ( ఎన్ ఇ ఆర్ ఏ ఎం ఏసి) పునుద్ధ‌రణ‌

వ్య‌వ‌సాయ‌, ఉద్యాన పంట‌లకు స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను అందించడంద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని అన్న‌దాత‌ల‌ను ఆదుకోవ‌డంకోసంగాను 1982లో ప్రాంతీయ వ్య‌వ‌సాయ మార్కెట్ కార్పొరేష‌న్ ( ఎన్ ఇ ఆర్ ఏ ఎం ఏ సి)ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. వ్య‌వ‌సాయ‌రంగానికి సంబంధించిన మౌలిక స‌దుపాయాల‌ను, సేక‌ర‌ణ స‌దుపాయాల‌ను, ప్రాసెసింగ్‌, మార్కెట్ మౌలిక స‌దుపాయాల‌ను పెంచ‌డమే ఈ సంస్థ ల‌క్ష్యం. ఈ సంస్థ కింద 75 రైతు ఉత్ప‌త్తి సంస్థ‌లు, కంపెనీలు న‌మోద‌య్యాయి. ఈశాన్య రాష్ట్రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన 13 జియోగ్రాఫిక‌ల్ ఇండికేట‌ర్ పంట‌ల ( జిఐ పంట‌లు) న‌మోదు ఈ సంస్థ ద్వారా సాధ్య‌మైంది. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండా రైతుల‌కు మేలు చేయ‌గ‌లిగేలా వారికి 15 శాతం అదిక ధ‌ర‌లు ల‌భించేలా ఒక వ్యాపార ప్ర‌ణాళిక‌ను ఈ సంస్థ త‌యారు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ పంట‌లు పండించ‌డంకోసం ఒక కేంద్రాన్ని స్థాపించ‌డంకోసం ఈ సంస్థ ప్ర‌తిపాద‌న చేసింది. త‌ద్వారా ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌ల‌కు స‌మాన‌మైన ఆర్ధిక స‌దుపాయం క‌ల్ప‌న జ‌రుగుతుంది. ఎన్ ఇ ఆర్ ఏ ఎం ఏ సి కోసం పున‌రుద్ధ‌రించిన ప్యాకేజీ మొత్తం రూ. 77.45 కోట్లు

3.జాతీయ ఎగుమ‌తుల బీమా అకౌంట్ కు ( ఎన్ ఇ ఐ ఏ) ద్వారా ఎగుమతుల ప్రాజెక్ట్ కోసం రూ. 33 వేల కోట్ల కేటాయింపు

మ‌ధ్య మ‌రియు దీర్ఘ‌కాలిక ప్రాజెక్ట్ ఎగుమ‌తుల‌ను జాతీయ ఎగుమ‌తి బీమా అకౌంట్ ( ఎన్ ఇ ఐఏ) ట్ర‌స్ట్ ప్రోత్స‌హిస్తోంది. ప్ర‌మాదాల‌ను ఎదుర్కొనే స‌దుపాయాల‌ను పెంచ‌డంద్వారా ఈ ప‌ని చేస్తోంది. ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చే కొనుగోలుదారుల క్రెడిట్ కు, త‌క్కువ క్రెడిట్ విలువ క‌లిగిన రుణ గ్ర‌హీత‌ల‌కు ర‌క్ష‌ణ‌ క‌ల్పిస్తుంది. ప్రాజెక్ట్ ఎగుమ‌తిదారుల‌కు మ‌ద్ద‌తునిస్తుంది. ఈ ఏడాది మార్చి 31వ‌ర‌కూ 52 దేశాల్లో 63 ర‌కాల భార‌తీయ ప్రాజెక్ట్ ఎగుమతిదారుల‌కు సంబంధించిన 211 ప్రాజెక్టుల‌కు ఎన్ ఇ ఐ ఏ మ‌ద్ద‌తుగా నిలిచింది. ఐదు సంవ‌త్స‌రాల‌పాటు ఎన్ ఇ ఐ ఏకు అద‌నపు కార్ప‌స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. త‌ద్వారా అద‌నంగా 33 వేల‌ కోట్ల ప్రాజెక్ట్ ఎగుమ‌తుల‌కు పూచీని ఏర్పాటు చేసిన‌ట్ట‌వుతుంది.

   4. ఎగుమ‌తి బీమా రక్ష‌ణ‌ను బ‌లోపేతం చేయ‌డానికిగాను రూ. 88 వేల కోట్లు

రుణ బీమా సేవ‌ల‌ను అందించ‌డం ద్వారా ఎగుమ‌తి రుణ హామీ కార్పొరేష‌న్ ( ఇసిజిసి) ఎగుమ‌తుల‌ను ప్రోత్స‌హిస్తుంది. దీని ఉత్ప‌త్తులు భార‌త‌దేశానికి చెందిన ఎగుమ‌తి వ‌స్తువుల్లో  30 శాతాన్ని ప్రోత్స‌హిస్తున్నాయి. ఎగ‌మతి బీమా ప‌రిధిని 88 వేల కోట్ల రూపాయ‌ల‌కు పెంచ‌డానికిగాను ఐదేళ్ల‌లో ఇసిజిసిలో ఈక్విటీని నింప‌డం జ‌రుగుతుంది.

   5. డిజిట‌ల్ ఇండియా : భార‌త్ నెట్ పిపిపి మోడ‌ల్ ద్వారా ప్ర‌తి గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ స‌దుపాయ క‌ల్ప‌న‌కుగాను రూ. 19, 041 కోట్ల కేటాయింపు.

దేశ‌వ్యాప్తంగా వున్న 2, 50, 000 గ్రామ పంచాయితీల్లో 1, 56, 223 గ్రామ పంచాయ‌తీల‌ను ఈ ఏడాది మే 31 నాటికి సేవ‌లందించేలా సిద్ధం చేయ‌డం జ‌రిగింది. వ‌య‌బిలిటీ గ్యాప్ విధానంలో నిధుల‌ను అందించేలా దేశంలోని 16 రాష్ట్రాల్లో తొమ్మిది ప్యాకేజీల రూపంలో పిపిపి మోడ‌ల్ ప్ర‌కారం భార‌త్ నెట్ అమ‌లు చేయాల‌ని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది. ఇందుకోసం అద‌నంగా 19, 041 కోట్ల రూపాయ‌ల‌ను అందించ‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా భార‌త్ నెట్ కింద మొత్తం కేటాయింపులను రూ. 61, 109 కోట్ల‌కు పెంచ‌డం జ‌రుగుతుంది. దాంతో అన్ని గ్రామ పంచాతీల్లోను భార‌త్ నెట్ సేవ‌లందించేలా ఈ ప‌థ‌కం విస్త‌ర‌ణ జ‌రుగుతుంది.

6. భార‌తదేశంలోనే ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల త‌యారీకోసం పిఎల్ ఐ ప‌థ‌కం కాల‌ప‌రిమితిని పెంచుతూ నిర్ణ‌యం.

ఎంపిక చేసిన రంగాలకు సంబంధించి భార‌త‌దేశంలో త‌యారైన వ‌స్తువుల అమ్మ‌కాల విష‌యంలో ఐదు సంవ‌త్స‌రాల‌పాటు పిఎల్ ఐ ప‌థ‌కం కింద 6నుంచి 4 శాతం ప్రోత్సాహ‌కాలు వుంటాయి. 2019-20ని ప్రారంభ సంవ‌త్స‌రంగా భావించి 2020 ఆగస్టు 1నుంచి ప్రోత్సాహ‌కాల ప‌థ‌కాన్ని ఇంక్రిమెంట‌ల్ సేల్స్ నిబంధ‌న‌తో  అమ‌లులోకి వ‌చ్చింది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆయా కంపెనీలు ఇంక్రిమెంట‌ల్ సేల్స్ నిబంధ‌న‌ను అనుస‌రించ‌లేక‌పోయాయి. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఉత్ప‌త్తి కార్య‌క‌లాపాల్లో అవాంత‌రాలు ఏర్ప‌డ‌డం, సిబ్బంది ప్ర‌యాణంలో ఇబ్బందులు, ఆయా ప‌రిశ్ర‌మ‌ల పున‌ర్ స్థాప‌న‌లో జాప్యం, స‌ర‌ఫ‌రావ్య‌వ‌స్థ‌ల్లో అవాంత‌రాల కార‌ణంగా ఆయా కంపెనీలు ఈ నిబంధ‌నను పాటించ‌లేక‌పోయాయి. దాంతో 2020-21లో ప్రారంభించిన ఈ ప‌థ‌కాన్ని మరో ఏడాది అంటే 2025-26వ‌ర‌కూ పొడిగించ‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కం కిందకు వ‌చ్చే కంపెనీలు త‌మ ఉత్ప‌త్తి ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికిగాను ఏ ఐదు సంవ‌త్స‌రాల‌నైనా ఎంపిక చేసుకునే సౌల‌భ్యం వుంటుంది. 2020-21లో పెట్టిన పెట్టుబ‌డులను కూడా అర్హ‌త‌గ‌ల పెట్టుబ‌డులుగా ప‌రిగ‌ణించ‌డం జ‌రుగుతుంది.

  7. సంస్క‌ర‌ణ‌ల ఆధారిత‌, ఫ‌లితాల‌తో సంబంధ‌మున్న విద్యుత్ పంపిణీ ప‌థ‌కంకోసం రూ. 3. 03 ల‌క్ష‌ల కోట్లు

సంస్క‌ర‌ణ‌ల ఆధారిత‌, ఫ‌లితాల‌తో సంబంధ‌మున్న‌విద్యుత్ పంపిణీ ప‌థ‌కం కింద ఆయా డిస్కంల‌కు ఆర్ధిక స‌హాయం అందించ‌డానికిగాను 2021-22  కేంద్ర బ‌డ్జెట్లో కేటాయింపులు ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కం కింద డిస్కంలు మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసుకుంటాయి. వ్య‌వ‌స్థ‌ను ఆధునీక‌రిస్తాయి. సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. అంతే కాదు వాటి ప‌నివిధానం మెరుగుప‌డుతుంది. అంద‌రికీ ఒకే ప‌రిమాణం స‌రిపోతుంద‌నే విధానం స్థానంలో ఆయా రాష్ట్రాల విధానం అమ‌లు చేసుకోవాల‌నేది ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్ది పొందాల‌నుకునే డిస్కంలు కొన్ని నిబంధ‌న‌ల్ని ముందుగా పాటించాలి. ఆయా డిస్కంలు త‌మ ఆడిట్ ఆర్ధిక నివేదిక‌ల‌ను ప్ర‌చురించాలి. ఆయా రాష్ట్రాలు త‌మ డిస్కంల‌కు బ‌కాయిల్ని, రాయితీల సొమ్ముల‌ను చెల్లించాలి. అద‌నంగా నియంత్రిత ఆస్తుల‌ను త‌యారు చేయ‌కూడ‌దు. ఈ ప‌థ‌కం కింద 25 కోట్ల స్మార్ట్ మీట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికిగాను సాయం అందిస్తారు. అంతే కాదు ప‌ది వేల ఫీడ‌ర్ల‌ను, 4 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల ఎల్ టి ఓవ‌ర్ హెడ్ లైన్ల‌ను ఏర్పాటు చేస్తారు. ఐపిడిఎస్‌, డిడియు జి జెవో, సౌభాగ్య ప‌థ‌కాల‌కు సంబంధించి జ‌రుగుతున్న ప‌నుల‌ను ఈ ప‌థ‌కంలో క‌లిపేస్తారు. ఈ ప‌థ‌కానికి సంబంధించి మొత్తం కేటాయింపులు రూ. 3, 03, 058 కోట్లు. ఇందులో కేంద్ర ప్ర‌భుత్వ వాటా రూ. 97, 631 కోట్లు. ఈ ప‌థ‌కం కింద అందుబాటులోకి వ‌చ్చే నిధులు రాష్ట్ర జిడిపిలో 0.5 శాతం రుణాల‌కు అద‌నం. అంతే కాదు  ఆయా రాష్ట్రాలు రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల్లో సంస్క‌ర‌ణ‌లు చేప‌డితేనే ఈ నిధుల అందుబాటు అనేది వుంటుంది. ఈ ఏడాది ఈ ఉద్దేశంకోసం అందుబాటులో వున్న రుణాలు రూ. 1, 05, 864 కోట్లు.

8. పిపిపి ప్రాజెక్టుల‌కోసం, ఆస్తుల మానిటైజేష‌న్ కోసం నూత‌న విధానం

ప్ర‌స్తుతం అమ‌ల్లో వున్న విధానాల ప్ర‌కారం పబ్లిక్ ప్రైవేట్ పార్ట‌న‌ర్ షిప్ (పిపిపి) ప్రాజెక్టుల‌కు ఆమోదం ల‌భించాలంటే చాలా స‌మ‌యం ప‌డుతోంది. ప‌లు ద‌శ‌ల్లో అనుమ‌తులు లభించాల్సి వుంటుంది. పిపిపి ప్ర‌తిపాద‌న‌ల‌కు త్వ‌రిత‌గిన ఆమోదం ల‌భించ‌డానికిగాను నూత‌న విధానం త‌యారు చేయ‌డం జ‌రుగుతుంది. త‌ద్వారా ప్ర‌ధాన‌మైన మౌలిక స‌దుపాయాల ఆస్తుల ద్వారా ల‌బ్ధి పొంద‌డం జ‌రుగుతుంది. రాబోయే నూత‌న విధానం కార‌ణంగా ప్రాజెక్టుల‌కు త్వ‌రిత‌గ‌తిన అనుమ‌తులు ల‌భించ‌డ‌మే కాదు ప్రైవేట్ రంగ సామ‌ర్థ్యాలు పెరిగి ఆయా కంపెనీలు మౌలిక స‌దుపాయాల నిర్మాణానికి, నిర్వ‌హ‌ణ‌కు కావాల్సిన నిధుల‌ను అందిస్తాయి.