ట్విట్టర్ ఇండియా చీఫ్‌పై ఎఫ్ఐఆర్

ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరిపై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మహేశ్వరితో పాటు, న్యూస్ పార్టనర్‌షిప్స్ హెడ్ అమృత త్రిపాఠి పేరును ఇందులో చేర్చారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా పేర్కొంటూ మ్యాప్‌ను తప్పుగా ట్విట్టర్ చూపించడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఐపీసీలోని సెక్షన్ 505(2), ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్ 74 కింద కేసులు నమోదు చేశారు. ”ఉద్దేశపూర్వకంగానే ఈ దేశద్రోహ చర్యకు పాల్పడ్డారు. చర్య తీసుకోవాల్సి ఉంటుంది” అని తన కంప్లయింట్‌లో బజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి పేర్కొన్నారు. 

భారత మ్యాప్‌ను వక్రీకరించి చూపించిన ట్విట్టర్​.. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో దాన్ని తొలగించింది. ట్విట్టర్​తన వెబ్‌సైట్‌లో భారత్‌లో అంతర్భాగమైన జమ్ముకాశ్మీర్​, లద్దాఖ్‌ను ప్రత్యేక దేశంగా చూపించింది.

గత వారం ఉత్తర్​ప్రశ్‌కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొంతమంది ట్విట్టర్‌ను ఉపయోగించుకున్నారని తెలిపారు. కేసుపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 

అయితే.. ఈ కేసులో యూపీ పోలీసుల నోటీసులపై కర్ణాటక హైకోర్టును మనీశ్ మహేశ్వరి ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. యూపీ పోలీసులు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.