దేశ సార్వ‌భౌమ‌త్వం ప‌ట్ల ట్విట్టర్ ధిక్కార స్వ‌రం

ఇప్ప‌టికే నూత‌న ఐటీ నిబంధ‌న‌ల అమ‌లులో కేంద్ర ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ‌కు దిగిన మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ దేశ సార్వ‌భౌమ‌త్వం ప‌ట్ల ధిక్కార స్వ‌రం వినిపిస్తున్న‌ది. తాజాగా భారతదేశంలోని భూభాగాలను తప్పుగా చూపింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మ‌కశ్మీర్, లడ‌ఖ్‌ల‌ను వేరే దేశంగా చూపి, భార‌త రాజ‌కీయ చిత్ర ప‌టాన్ని వక్రీకరించింది.

ట్విటర్‌ ఇండియా మ్యాప్‌ నుంచి జమ్మూకశ్మీర్‌ను తొలగించింది. జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో  అంతర్బాగంగా చూపించింది. అంతేకాకుండా కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. దీంతో ట్విటర్‌పై కేంద్రం తీవ్ర చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను అమ‌లు చేసే విష‌యంలో కేంద్రం-ట్విట్ట‌ర్ మ‌ధ్య ఉప్పూనిప్పూ అన్న ప‌రిస్థితులు ఉన్నాయి. తాజా చ‌ర్య‌తో ట్విట్ట‌ర్‌పై కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ద‌ని స‌మాచారం.

గతేడాది కూడా ట్విట్టర్ ఇలానే ప్రవర్తించింది. లడఖ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించి భారత ప్రభుత్వ ఆగ్రహానికి గురైంది. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది. ఇప్పుడు మరోమారు అదే తప్పు చేసింది. అయితే, ఈసారి లడఖ్‌ను వేరే దేశంగా చూపించింది. ట్విట్టర్ తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ట్విట్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే నూతన ఐటీ నిబంధనలు పాటించడంలో విఫ‌ల‌మైనందుకు ట్విటర్‌పై కేంద్ర ప్ర‌భుత్వం చర్యలు చేప‌ట్టింది. దీంతో అది త‌న‌కు ఉన్న మ‌ధ్య‌వ‌ర్తిత్వ హోదాను కోల్పోయింది. ఈ నేప‌థ్యంలో ట్విటర్‌పై పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసులూ నమోదవుతున్నాయి.దీనికి తోడు ఇటీవల కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖాతానూ గంటపాటు నిలిపివేసింది. దీనిపై ఆయ‌న తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ట్విటర్ ధిక్కార ధోర‌ణిని నిల‌దీసినందుకే త‌న ఖాతా నిలిపేసి ఉంటార‌ని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ పేర్కొన్నారు.