ఆర్చరీ ప్రపంచ కప్ లో చెలరేగిన భారత్ ఆర్చర్లు

ఆర్చరీ ప్రపంచ కప్ మూడో అంచె పోటీల్లో ఆదివారం భారత స్టార్ ఆర్చర్లు చెలరేగి పోయారు. ఒకే రోజు మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ మూడు విభాగాల్లో మహిళా నంబర్ వన్ అర్చర్ దీపికా కుమారి పాలు పంచుకోవడం గమనార్హం. 

ఒక్క రోజే బంగారు పతకాల హ్యాట్రిక్ సాధించి త్వరలో జరగబోయే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలపై ఆశలను మరింత పెంచింది. తొలుత రికర్వ్ టీం ఈవెంట్ విభాగంలో దీపికా కుమారి, అంకిత భకత్, కోమాలిక.. మెక్సికన్ టీమ్‌కు చెందిన ఐదా రోమన్, అలెజాండ్ర వాలెన్‌సియా, అనా వాజేకుక్‌ను 51తేడాతో ఓడించారు.

కాగా ఈ ఏడాది ప్రపంచకప్‌లో వీరికిది రెండో విజయం కావడం గమనార్హం. రెండునెలల క్రితం గ్వాటిమాలాలో జరిగిన ప్రపంచకప్‌లోను ఈ భారతీయ అమ్మాయిలు ఇదే మెక్సికన్ టీమ్‌ను ఓడించడం గమనార్హం. మరోవైపు మిక్స్‌డ్ టీమ్‌లోను భారత స్టార్ జోడీ అతనుదాస్, దీపికా కుమారి స్వర్ణం దక్కించుకున్నారు.

నెదర్లాండ్స్‌కు చెందిన జెఫ్ వాన్‌బర్గ్, గాబ్రిలా స్కాలెసర్‌ను 5 3తేడాతో ఓడించి స్వర్ణం దక్కించుకుంది. ప్రారంభంలో 02 తేడాతో వెనుకబడినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఈ జంట టైటిల్‌ను దక్కించుకుంది. తామిద్దరమూ జంటగా సాధించిన తొలి విజయం ఇదని పోటీ అనంతరం అతనుదాస్ చెప్పారు.

నిజజీవితంలో వీరిద్దరూ దంపతులు కావడం గమనార్హం. చివరగా మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దీపిక రష్యాకు చెందిన ఎలెనా ఒసిపోవాను 6 0 తేడాతో చిత్తుగా ఓడించి హ్యాట్రిక్ సృష్టించింది. కాగా ఈ పోటీల్లో భారత్‌కు ఇది నాలుగో బంగారు పతకం కావడం గమనార్హం. శనివారం జరిగిన పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో అగ్రశ్రేణి ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణం సొంతం చేసుకున్నాడు. అమెరికాకు చెందిన క్రిస్ షాఫ్‌ను షూటాఫ్‌లో ఓడించి విజేతగా నిలిచాడు.