టీకాలు వేయడంలో ఎన్జీవోల సాయం కోసం ప్రధాని పిలుపు

ప్రజల్లోకి మరింత వేగంగా టీకాలను చేరువ చేసేందుకు ఎన్జీవోల సాయం తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ రేటుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

‘‘దేశ వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రధాని నరేంద్ర మోదీకి అధికారులు సమగ్ర వివరాలు అందించారు. వయసుల వారీగా వ్యాక్సినేషన్ కవరేజి గురించి అధికారులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు సహా సాధారణ ప్రజానీకానికి అందిన వ్యాక్సీన్ కవరేజిపైనా ప్రధాని ఆరా తీశారు..’’ అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.

రాబోయే నెలల్లో జరగాల్సిన వ్యాక్సీన్ పంపిణీ, ఉత్పత్తిని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులు మోదీపై ప్రశంసించినట్టు పీఎంవో పేర్కొంది. ‘‘గడచిన ఆరు రోజుల్లో 3.77 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేసినట్టు అధికారులు ప్రధానికి వివరించారు. ఈ సంఖ్య మలేషియా, సౌదీ అరేబియా, కెనడా వంటి దేశాల జనాభాతో సమానం…’’ అని ప్రధాని కార్యాలయం పేర్కొంది.

వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎన్జీవోలో ఇతర స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నట్టు వెల్లడించింది. కాగా కరోనా నిర్ధారణ పరీక్షలను తగ్గించకుండా రాష్ట్రాలతో కలిసి పనిచేయాలనీ… ఎక్కడైనా ఇన్ఫెక్షన్లను గుర్తించి, వ్యాప్తిని వెంటనే నిలువరించేందుకు పరీక్షలే పరమాయుధమని ప్రధాని స్పష్టం చేశారు.