మారుమూల లాయర్లకూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌

మారుమూల ప్రాంతాల్లో ఉన్న న్యాయవాదుల కోసం హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వసతి అందుబాటులోకి తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ ఎన్ వి రమణ కేంద్రప్రభుత్వానికి సూచించారు. నగరాల్లోని లాయర్లకు అందుబాటులో ఉన్నట్టుగా సబార్డినేట్‌ కోర్టు స్థాయిలో లాయర్లకూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులో లేదన్న అంశాన్ని ప్రస్తావించారు.

ఈ మేరకు ఇటీవల కేంద్ర న్యాయ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు తాను 8న లేఖ రాసినట్టు తెలిపారు. సుప్రీం కోర్టు రిటైర్డ్‌ జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ రచించిన ‘చట్టం, న్యాయంలో క్రమరాహిత్యాలు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ  గ్రామీణ, గిరిజన, మారుమూల, పర్వత ప్రాంతాల్లో కనెక్టివిటీ సరిగాలేక న్యాయం అందడంలో వేగంపై తీవ్ర ప్రభావం చూపిందని, వేలాది మంది యువ న్యాయవాదుల జీవనోపాధికి తీవ్ర విఘాతం కలిగించిందని ఆందోళన వ్యక్తంచేశారు.

ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లభ్యతలో తారతమ్యాల కారణంగా న్యాయవ్యవస్థ నుంచి ఒక తరం న్యాయవాదులను బలవంతంగా నెట్టివేసినట్టు అవుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. కోవిడ్‌ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న లాయర్లకు సాయపడేందుకు యంత్రాంగం ఏర్పాటుచేయాలని న్యాయ శాఖ మంత్రికి సూచించినట్లు వెల్లడించారు.

సాంకేతిక అసమానతల వల్ల వ్యవస్థలో న్యాయవాదులు ఇమడలేక పోతున్నారని, వేలాది మంది న్యాయవాదులు జీవనోపాధి కోల్పోతున్నారని తన లేఖలో ప్రస్తావించారు. ఇటీవల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో జరిగిన సమావేశం లో చర్చకొచ్చిన కొన్ని కీలక అంశాల్లో డిజిటల్‌ వ్యత్యాసాలతో పాటు న్యాయ వ్యవస్థతో ముడివడిన వారికి వాక్సినేషన్‌, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న న్యాయవాదుల పరిస్థితి, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు, హైకోర్టుల్లో ఖాళీలు మొదలైనవి ఉన్నాయని వివరించారు.

వాటి పై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని జస్టిస్‌ రమణ చెప్పారు. ఈ అంశాలపై అత్యంత ఉన్నత స్థాయిలో సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలతో చర్చించాలని ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు లు పూర్తి స్థాయిలో పనితీరు ప్రదర్శించాలంటే న్యాయస్థానాలతో ముడివడి ఉన్న అందరికీ, వారి కుటుంబ సభ్యులతో సహా వాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని సీజే స్పష్టం చేశారు.

న్యాయవాదులతో సహా కోర్టుల్లో పనిచేసే అందర్నీ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లుగా గుర్తించాలని కోరారు. న్యాయవాదులకు ఏడాదిగా పని లేనందున జూనియర్‌ న్యాయవాదులకు ఆర్థిక మద్దతు అందించే విషయం ఆలోచించాలని సూచించారు.

సరళీకృత ఆర్థిక వాతావరణంలో భారతదేశ శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రన్‌ తీర్పులు ఎంతగానో దోహదం చేశాయని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ చెప్పారు. దేశంలో వివాదాల పరిష్కార క్రమంలో ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతుందని జస్టిస్‌ రవీంద్రన్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

ఆయన మధ్యవర్తిత్వంలో అనేక వివాదాస్పద కేసులను పరిష్కరించారని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో కోర్టు లు అతిగా జోక్యం చేసుకోవడం వల్ల దేశ ప్రతిష్ట దెబ్బ తింటుందని రవీంద్రన్‌ తొలిసారి గుర్తించారని తెలిపారు. ఆయన రూపొందించిన మార్గదర్శక సూత్రాలే మధ్యవర్తిత్వ చట్ట సవరణలో భాగమయ్యాయని చెప్పారు.

న్యాయ వ్యవస్థలో అత్యాధునిక ఐటీ, కమ్యూనికేషన్‌ టెక్నాలజీతో పాటు మౌలిక సదుపాయాల ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని జస్టిస్‌ రమణ గుర్తు చేశారు. కరోనా అనంతరం ప్రజలకు న్యాయవ్యవస్థ అందుబాటు పెరగాలంటే న్యాయ మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతీయ న్యాయ మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ (ఎన్‌జీఐసీ) ఏర్పాటుకు సంబంధించి బ్లూప్రింట్‌ రూపకల్పన అంతిమ దశలో ఉందని, అది పూర్తి కాగానే కేంద్రానికి పంపిస్తానని చెప్పారు. కరోనా

న్యాయవ్యవస్థ మెరుగైన పనితీరు కనబరచడానికి ఖాళీలను మహమ్మారి వల్ల ఎదురైన సవాళ్ల నేపథ్యంలో మౌలిక సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనను అమలు చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని తాను దృఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.