రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి

కృష్ణానదిపై చేపట్టిన రాయల సీమ ఎత్తిపోతల పథకాల పనులపై కృష్ణారివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సీరియస్ అయింది. పనులు వెంటనే ఆపాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర జలవనరుల సంఘానికి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు అందచేసి ఆమోదం పొందేంత వరకూ ఎటు వంటి పనులు చేపట్టరాదని హెచ్చరిస్తూ బోర్డు ఛైర్మన్ ఆదేశాలమేరకు సభ్యుడు హెచ్‌కె మీనా ఏపి నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖరాశారు.

రాయలసీయ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టవద్దని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన ఆదేశాలను లేఖ ద్వారా గుర్తు చేశారు. గత ఏడాది మేలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన ఆదేశాలను కూడా బోర్డు తన లేఖలో ప్రస్తావించింది. 

కృష్ణానదీ జలాలను మరింత అధిక మొత్తంలో ఉపయోగించుకునేందుకు ఏపి ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ పథకం పనులు ఆపాలని. వెంటనే అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి షెకావత్ గత ఏడాది మేలో కృష్ణాబోర్డుకు అదేశాలిచ్చారు.

ఏపి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్న కృష్ణానదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది తేలేవరకూ పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎత్తిపోతల పధకాల విషయంలో తుదుపరి చర్యలు తీసుకోకుండా ఏపిని కట్టడి చేయాలని కేంద్ర మంత్రి షెకావత్ కృష్ణారివర్ బోర్డును ఆదేశించి ఏడాది గడిచిపోయింది.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అప్పటి బోర్డు ఛైర్మన్ ఏపి జలవనరులశాఖకు లేఖ రాశారు. కృష్ణానదిపైన ఎటువంటి ఎత్తిపోతల పథకాల పనులు చేపట్టవద్దని లేఖలో బోర్డు ఛైర్మన్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇవేవి లేక్కచేయకుండా ఏపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద విస్తరణ పనులు చేస్తుండటంపై తెలంగాణ సర్కారు భగ్గమంది.

అక్కడ జరుగుతున్న పనులను చిత్రీకరించి తగిన ఆధారాలతో బోర్డు ఛైర్మన్‌ను ఉద్దేశించి తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఏపి ప్రభుత్వం చేపట్టిన పనుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆందోళన కరపరిస్థితులు ఏర్పడుతున్నాయని, హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలకు సైతం తీవ్రమైన సమస్యలు ఏర్పడనున్నాయని లేఖలో స్పష్టం చేశారు. 

జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా రాయలసీయ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులపై స్టే విధించిన విషయాన్ని లేఖలో గుర్తుచేశారు. వెంటనే పనులు నిలిపివేయించాలని బోర్డును కోరారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖకు వెంటనే ప్రతిస్పందించిన కృష్ణారివర్‌బోర్డు ఏపికి అంతే వేగంగా లేఖరాసింది. ఆమోదం పోందేవరకూ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టవద్దని ఏపిని ఆదేశిస్తూ ఈ మేరకు లేఖరాసింది.