ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం చరిత్రాత్మకం

జమ్మూ, కశ్మీర్ లో ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం చరిత్రాత్మకం అని బిజెపి తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కె .కృష్ణ సాగర్ రావు కొనియాడారు. ఈ నిర్ణయం ద్వారా నరేంద్ర మోడీ  జాతీయ ఎజెండా ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ స్పష్టమౌతోందని పేర్కొన్నారు. 

గతంలో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు 2019 ఆగస్టు లో ఆయన ఇచ్చిన హామీ మేరకు తన మాట నిలబెట్టుకుని రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించబోతున్నారని భరోసా వ్యక్తం చేశారు.

జమ్మూ, కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి అంత మంది అఖిలపక్ష నాయకుల్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ  తన దీర్ఘకాలిక విజన్ ని, జాతీయ ఎజెండాని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకున్నారని అభినందించారు.

నిన్న జరిగిన సమావేశం తర్వాత జమ్మూ, కశ్మీర్ కు సంబంధించిన నాయకులందరి ప్రకటనలు వారు చెప్పిన విషయాలు పరిశీలిస్తే గనుక ప్రధాని మోదీకి అత్యంత బద్ధ రాజకీయ ప్రత్యర్థులైన వారు కూడా ప్రధాని మోదీ  మీద ఎంత సమగ్రత, విశ్వాసం, గౌరవం ఉన్నాయో అర్థం అవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ  మరోసారి తన జాతీయ రాజనీతిజ్ఞను చాటుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.