విశాఖలో రూ 330 కోట్లతో రక్షణ రంగ పరిశ్రమలు 

దేశ రక్షణకు అవసరమైన కీలక ఆయుధాలు, క్షిపణులను రూపొందిస్తున్న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విశాఖపై తన దృష్టి సారించింది. కార్యాలయంతోపాటు రక్షణ రంగ విడిభాగాల తయారీ పరిశ్రమను నగరంలోని మధురవాడలో నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

5 ఎకరాల స్థలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, తదితరాలకు కావాల్సిన పరికరాలు తయారు చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని డీఆర్‌డీవో భావిస్తోంది. దీంతోపాటు డీఆర్‌డీవో ప్రత్యేక కార్యాలయాన్ని ఇక్కడే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

ఇందులో ముఖ్యంగా శత్రు మూకల నుంచి సైబర్‌ దాడిని ఎదుర్కొనేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ రెండింటి కోసం రూ.330 కోట్లు వెచ్చించనుంది. 

ఇటీవల నేవల్‌ సైన్స్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌టీఎల్‌)ని సందర్శించిన డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి విశాఖలో రక్షణ రంగ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ యతిరాజ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మధురవాడ హిల్‌ నం.4లో డీఆర్‌డీవో కోసం 5 ఎకరాల స్థలాన్ని రిజర్వ్‌ చేసినట్లు తెలిపారు.

రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వదేశీ తయారీకి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న సంగతి తెలిసిందే. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్‌ భారత్‌ను అమలు చేసేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల రక్షణ రంగ విడిభాగాలు తయారు చేసే పరిశ్రమలు నెలకొల్పేందుకు డీఆర్‌డీవో సిద్ధమవుతోంది.

దేశ రక్షణ రంగంలో ముఖ్య భూమిక పోషిస్తున్న విశాఖ నగరంతో పాటు మచిలీపట్నం, అనంతపురం, కృష్ణా, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రక్షణరంగ విడి భాగాల తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు ప్రధాన కేంద్రంగా డీఆర్‌డీవో విశాఖను ఎంపిక చేసుకుంది. 

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన డీఆర్‌డీవో అధికారులు మధురవాడలోని ఏపీఐఐసీ హిల్స్‌లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో హిల్‌ నంబర్‌–4లో 5 ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) డీఆర్‌డీవోకి కేటాయించింది.