జ‌మ్ముక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా, సత్వరం ఎన్నికలు.. ప్రధాని భరోసా

జ‌మ్ముక‌శ్మీర్‌  కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు, అక్కడ అసెంబ్లీకి సత్వరం ఎన్నికలు జరిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ నాయకులకు భరోసా ఇచ్చారు.  అన్ని పార్టీల నేత‌ల‌తో మూడు గంట‌ల‌కుపైగా సాగిన‌ సమావేశంలో నియోజకవర్గాల పున‌ర్విభ‌జ‌న‌, రాష్ట్ర హోదా, ఎన్నిక‌ల అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు నేతలు చెప్పారు. 

స‌మావేశం సంద‌ర్భంగా జ‌మ్ముక‌శ్మీర్‌కు మ‌ళ్లీ రాష్ట్ర హోదా ఇవ్వ‌డానికి తాను క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ప్ర‌ధాని మోదీ హామీ ఇచ్చార‌ని జ‌మ్ముక‌శ్మీర్ అప్నీ పార్టీ చీఫ్ మ‌హ్మ‌ద్ బుఖారీ వెల్ల‌డించారు. రాష్ట్ర హోదా ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు మోదీ చెప్పార‌ని కాంగ్రెస్ నేత గులాంన‌బీ ఆజాద్ చెప్పారు.

ఆగష్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 అమలును రద్దు చేస్తూ, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం అక్కడి రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరపడం ఇదే ప్రధమం కావడం గమనార్హం. ఆ తర్వాత వీరిలో పలువురు నేతలు నిర్బంధంలో కూడా ఉన్నారు. అయితే, ఆర్టికల్ 370 పునరుద్దరన జరిగే వరకు ప్రభుత్వంలో చర్చల ప్రసక్తి లేదని అంటూ వస్తున్న ఈ నాయకులు ఆ అంశాన్ని ప్రస్తావించక పోవడం గమనార్హం.

జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలను నిర్వహించిన తీరుగానే అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యమని తాము భావిస్తున్నామని, అయితే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరమే ఎన్నికలు ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలతో మెజారిటీ నాయకులు ఏకీభవించారని అధికార వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర హోదా డిమాండ్‌తోపాటు ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించ‌డానికి వెంట‌నే అసెంబ్లీ ఎన్నిక‌లు పెట్టాల‌ని, క‌శ్మీరీ పండిట్ల‌కు జ‌మ్ముక‌శ్మీర్‌లో పున‌రావాసం, అన్ని పార్టీల నేత‌ల‌ను నిర్బంధం నుంచి విడుద‌ల చేయాల‌ని మోదీని అడిగిన‌ట్లు ఆజాద్ వెల్ల‌డించారు. స‌మావేశం చాలా స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో జ‌రిగింద‌ని, జ‌మ్ముక‌శ్మీర్ ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న సానుకూల దృక్ఫ‌థంతో తాము బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత స‌జ్జ‌ద్ లోన్ చెప్పారు.

ప్రధానంగా ఐదు అంశాలను నాయకులు ప్రధాని ముందుంచారు.  జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని, వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని, స్థానికులకు భూమిపై హామీ ఇవ్వాలని, కశ్మీరీ పండిట్ల పునరావాసానికి చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 

అయితే, ముందుగా నియోజకవర్గాల పునర్విభజన పక్రియ సవ్యంగా జరిగే  విధంగా అందరు సహకరించాలని, ఈ ప్రక్రియలో అందరు క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రధాని మోదీ వారిని కోరారు. ఈ పక్రియ పూర్తి కాగానే మిగిలిన అన్ని అంశాలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

“కాశ్మీర్ లో శాంతి నెలకొనాలని కోరుకొంటున్నాము, అక్కడ ఘర్షణ వాతావరణం కొనసాగాలని కేంద్రం కోరుకోవడం లేదు” అని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదే విధంగా అక్కడ క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యంను బలోపేతం చేయడమే తమ లక్ష్యం అని చెబుతూ, ఎన్నికలు జరపాలంటే ముందుగా నియోజకవర్గాల పునర్విభజన పూర్తి కావాలని ప్రధాని చెప్పారు. 

ఢిల్లీ పాలన కొనసాగాలని అనుకోవడం లేదని కూడా తేల్చి చెప్పారు. తాను “ఢిల్లీ కి దూరి తో పాటు డీల్ కి దూరి” (ఢిల్లీ నుండి దూరంతో పాటు, హృదయం నుండి దూరం కూడా పోవాలి అనుకొంటున్నాను” అని తెలిపారు. 

ఈ సమావేశానికి జమ్మూ కశ్మీర్‌కు చెందిన నలుగురు మాజీ మఖ్యమంత్రులు  ఫరూఖ్‌ అబ్దుల్లా (ఎన్సీ), ఒమర్‌ అబ్దుల్లా (ఎన్సీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), గులాం నబీ ఆజాద్‌(కాంగ్రెస్‌)  సహా మరో 14 మంది నేతలు హాజరు అయ్యారు. ప్ర‌ధాని మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి జితేంద్ర సింగ్,  ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ కూడా పాల్గొన్నారు.

ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన  తారాచంద్‌(కాంగ్రెస్‌), ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ (పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌), నిర్మల్‌ సింగ్‌ (బీజేపీ), కవీందర్‌ గుప్తా (బీజేపీ) ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. మొహమ్మద్‌ యూసుఫ్‌ తరిగమి (సీపీఎం), అల్తాఫ్‌ బుఖారీ (జేకేఏపీ), సజ్జాద్‌ లోన్‌ (పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌), జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ జీఏ మిర్, రవిందర్‌ రైనా (బీజేపీ), భీమ్‌ సింగ్‌ (పాంథర్‌ పార్టీ) కూడా ప్రధానితో సమావేశమైన వారిలో ఉన్నారు. 

జమ్మూ, కాశ్మీర్ అభివృద్ధి వేగం పుంజుకోవాలి అంటే ముందుగా అక్కడ ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని సమావేశం తర్వాత ఒక ట్వీట్ లో  హోమ్ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. “రాష్ట్ర హోదా పునరుద్దరణకు నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికలు జరపడం కీలకం కాగలవు” అని ఆయన తెలిపారు.

కేవలం 10 నిముషాల సేపు మాత్రమే మాట్లాడిన ప్రధాని అందరి అభిప్రాయాలను ఓపికగా విన్నారని, అందరు నిర్మోహాటంగా, నిజాయతీగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారని ప్రభుత్వం వర్గాలు తెలిపారు. సమావేశం సుహృద్భావ వాతావరణంలో, సానుకూల ధోరణిలో జరిగిన్నట్లు పాల్గొన్న నాయకులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.