ఆక్సిజన్ సరఫరాను రాజకీయం చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం

కరోనా రెండో వేవ్ సమయంలో కేజ్రీవాల్ సర్కార్ ఆక్సిజన్ డిమాండ్‌ను అవసరానికి కంటే నాలుగు రెట్లు హెచ్చు చేసి చెప్పిందని బీజేపీ ప్రతినిధి సంబత్ పాత్ర ఆరోపించారు. ఇది కేజ్రీవాల్ ”హేయమైన నేరం” అని ధ్వజమెత్తారు. 

కోవిడ్ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కేజ్రీవాల్, ఢిల్లీ ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరాను ఊహించని విధంగా రాజకీయం చేసిందని, నీచమైన రాజకీయాలకు పాల్పడిందని ఆయన మండిపడ్డారు. ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఇచ్చిన నివేదికలోని విషయాలు దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. 

”అవసరానికి మించి నాలుగు రెట్లు ఆక్సిజన్ డిమాండ్ చేశారు. దీంతో ట్యాంకర్లన్నీ రోడ్డుపైనే ఉండిపోయాయి. ఆ ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడి ఉంటే చాలా ప్రాణాలు నిలిచి ఉండేవి. ఇది అరవింద్ కేజ్రీవాల్ చేసిన హేయమైన నేరం” అని సంబిత్ పాత్ర స్పష్టం చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదని, దీనికి కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 25-మే 10 మధ్య కాలంలో కోవిడ్ మహమ్మారి అత్యంత తీవ్ర స్థాయిలో ఉందని, ఆ సమయంలో ఢిల్లీ నగరంలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని సుప్రీంకోర్టు ప్యానల్ మధ్యంతర నివేదిక పేర్కొంది. ఢిల్లీకి అవసరానికి మించి ఆక్సిజన్‌ను సరఫరా చేయడం వల్ల, కోవిడ్-19 కేసులు ఎక్కువగా ఉన్న 12 రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరాపై ప్రభావం పడినట్లు పేర్కొంది.

బెడ్ కెపాసిటీ ఆధారంగా రూపొందించిన సూత్రం ప్రకారం లెక్కించినపుడు ఆక్సిజన్ వినియోగం కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా చెప్పిందని పేర్కొంది. 1,140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఖర్చయినట్లు తెలిపిందని, అయితే బెడ్ కెపాసిటీ ఆధారంగా లెక్కించినపుడు 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వినియోగమైనట్లు వెల్లడవుతోందని తెలిపింది. ఢిల్లీలో ఆక్సిజన్ సగటు వినియోగం 284 నుంచి 372 మెట్రిక్ టన్నులని తెలిపింది.

ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా సారథ్యంలోని ప్యానల్ సభ్యులలో ఢిల్లీ ప్రభుత్వ ప్రిన్సిపల్ హోం సెక్రటరీ భూపిందర్ భల్లా, మాక్స్ హెల్త్ కేర్ డైరకె్టర్ డాక్టర్ సందీప్ బద్ధరాజా, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుబోధ్ యాదవ్ ఉన్నారు.