వంశధార నదీ జలాలు ఏపీ, ఒడిశాలకు చేరి సగం 

వంశధార నదీ జలాలను ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని వంశధార జలవివాదాల ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. నేరడి ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాల భూమిని సేకరించాల్సిన బాధ్యత ఒడిషా ప్రభుత్వానిదేనని ట్రిబ్యునల్‌ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా నేరడి ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ 106 ఎకరాల్లోనే సాధ్యం కాదని, ఇప్పటి వరకు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తమకు ఇవ్వలేదంటూ ఒడిషా ప్రభుత్వం వంశధార ట్రిబ్యునల్‌లో మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసింది.

నేరడి ప్రాజెక్టు నిర్మాణం, నిర్మాణ కార్యక్రమాలు, నిర్వహణ, వంశధార జల పంపకాల విషయంలో పర్యవేక్షణ కమిటీ సభ్యుల మధ్య విభేదాలు వస్తే పరిష్కారానికి ఒక అప్పీల్‌ అథారిటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మరో మధ్యంతర పిటిషన్‌ను ట్రిబ్యునల్‌లో దాఖలు చేసింది.

ఈ రెండు మధ్యంతర పిటిషన్లపై ట్రిబ్యునల్‌ సోమవారం తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కోరిన విధంగా నేరడి ప్రాజెక్టుకు సంబంధించిన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి అవసరమైన 106 ఎకరాలను సేకరించాల్సిన బాధ్యత ఒడిషా ప్రభుత్వానిదేనని ట్రిబ్యునల్‌ స్పష్టం చేసింది. 

సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. పర్యవేక్షణ కమిటీలో రెండు రాష్ట్రాల నీటీ పారుదల శాఖ అధికారులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, కేంద్ర జల సంఘం (సిడబ్ల్యుసి) అధికారులు ఉన్నారని ట్రిబ్యునల్‌ గుర్తు చేసింది.

నదీ జలాల పంపకం విషయంలో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య విభేదాలు తలెత్తితే వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, సిడబ్ల్యుసి, అధికారులపై ఉందని ట్రిబ్యునల్‌ పేర్కొంది. మరో అప్పీలు అథారిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్‌ అభిప్రాయపడింది. 

వంశధార నదీ జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం వాడుకోవాలని గతంలోనే తాము ఆదేశించినట్లు తెలిపింది. నదీ జలాలు 115 టిఎంసిల్లో చెరిసగం పంచుకోవాలని ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగిందని ట్రిబ్యునల్‌ పేర్కొంది. నదిలో 115 టిఎంసిల జల లభ్యత ఉన్నా, అంతకన్నా ఎక్కువ, తక్కువ వచ్చినా చెరిసగం వాడుకోవాలని స్పష్టం చేసింది.