దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ అరెస్ట్   

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే రఘునందన్ రావు వెళ్లారు. అయితే, సంఘటన స్థలానికి వెళ్లకుండా ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తుక్కాపూర్ వద్ద ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ, మల్లారెడ్డి ఆత్మహత్య పట్ల విచారం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే… స్థానిక ఎమ్మెల్యేగా బాధిత కుటంబాన్ని పరామర్శించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.

70 ఏళ్ల రైతు మల్లారెడ్డి… ముగ్గురు ఆడపిల్లల తండ్రి.. తన చితిని తాను పేర్చుకుని సజీవ దహనమైన ఘటన… ఉదయం నుంచి కలచి వేసిందంటూ ఉద్వేగానికి గురయ్యారు. సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్.. అక్కడే ముంపు బాధితులపై తొలి సమీక్ష నిర్వహించాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. 

అయితే, తనను గ్రామాన్నికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా కేసీఆర్ పాలన ఉందని విమర్శించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుపై మాట్లాడేవారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.  మల్లన్న సాగర్ ముంపు ప్రాంతాల రైతలు సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

కాగా, మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి ఇంటి ఆవరణలోనే చితి పేర్చుకుని కిరోసిన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో తుటుకూరి మల్లారెడ్డి( 70) ఇంటిని అధికారులు కూల్చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో మనోవేదనతో మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే అర్హులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందించామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమే అయ్యింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కేసీఆర్ సర్కార్‌పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.