హైదరాబాద్ లో బాలలకు డీఆర్డీ కరోనా ఆసుపత్రికై వినతి 

కరోనా చికిత్సకోసం దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్న చిన్న పిల్లల కోసం ప్రత్యేక కొవిడ్ ఆసుపత్రిని హైదరాబాద్ నగరంలో నెలకొల్పాలని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థను విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ కోరింది. ఈ ఆసుపత్రిని డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. 

ఈ మేరకు డీఆర్డీవో చైర్మన్‌ సతీశ్ రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ లేఖ రాశారు. డీఆర్డీవో పరిశోధనలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రమని, దేశంలో వివిధ పట్టణాలలో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రులు నిర్మిస్తున్న డీఆర్డీవో  హైదరాబాద్ నగరంలోనూ కోవిడ్ హస్పిటల్ ఏర్పాటు చేయాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

కోవిడ్ మూడో దశలో చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో దీనిపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. చిన్న పిల్లల కోసం కనీసం 500 పడకలతో కూడిన తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, దానికి మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం పేరు పెడితే బాగుంటుందని ఆ  లేఖలో తెలిపారు.

డాక్టర్ కలామ్‌కు నగరంలోని డీఆర్డీవోతో, చిన్న పిల్లలతో విడదీయలేని అనుబంధం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. సికింబ్రాబాద్‌లో రక్షణ శాఖకు సంబంధించిన అనేక ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయని, వాటిల్లో ఈ ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం చేపట్టగలరని పేర్కొన్నారు. ఈ మేరకు చైర్మన్ సతీశ్ రెడ్డి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్టు శశిధర్ తెలిపారు.

 
.