ఏపీ శాసనమండలిలో ఆధిక్యంలోకి వైఎస్సార్‌సీపీ

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో రాజకీయ సమీకరణాలు మారాయి.  మండలిలో నేటి నుంచి ఆధిక్యంలోకి వైఎస్సార్‌సీపీ వచ్చింది. రెండేళ్లుగా ఆధిక్యంలో ఉన్న టిడిపి తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. 

మండలిలో టిడిపి ఆధిక్యతలో ఉండడంతో శాసనసభ ఆమోదించిన పలు బిల్లులకు అడ్డుగా నిలుస్తున్నదనే ఆగ్రహంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మండలిని రద్దుచేయాలని కోరుతూ శాసనసభలో అర్ధాంతరంగా బిల్ ను ఆమోదింపచేసి, ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంకు పంపడం తెలిసిందే. 

అయితే పలు రాష్ట్ర శాసనసభల నుండి అటువంటి ప్రతిపాదనలు రావడం, అన్ని రాష్ట్రాలకు కలిపి శాసనమండలిల విషయంలో ఒక విధాన నిర్ణయం తీసుకోమని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించడంతో కేంద్ర ప్రభుత్వం అటువంటి బిల్లులను పెండింగ్ లో ఉంచడంతో రాష్ట్ర శాసనమండలి ఇంకా రద్దుకాలేదు.

రద్దయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. పైగా, ఇప్పుడు తమ పార్టీకే ఆధిక్యత రావడంతో ఇక ముఖ్యమంత్రి ఆ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపించడం లేదు. 

నేడు మండలి నుంచి ఏడుగురు టీడీపీ సభ్యులు రిటైర్‌ కావడంతో  మండలిలో ఆ పార్టీ బలం  22 నుంచి 15కు  పడిపోనుంది. గవర్నర్‌ కోటాలో తాజాగా నలుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులు నామినేట్‌ కావడంతో మండలిలో ఆ పార్టీ బలం  17 నుంచి 20కు పెరగనుంది. నేడు వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రిటైర్‌ కానున్నారు.

టిడిపికి చెందిన మండలి చైర్మన్ మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ కూడా గత నెలాఖరులోనే రిటైర్ అయ్యారు. దానితో ఇప్పుడు అధికార పక్షం తమ పార్టీకి చెందినవారిని చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా ఎన్నుకొనే అవకాశం కూడా ఏర్పడింది.