పుదుచ్చేరి స్పీకర్‌ గా బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌ బీజేపీ ఎమ్మెల్యే ఎన్బలం సెల్వం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బుధవారం ఆయన స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, ప్రతిపక్ష నేత ఆర్ సెల్వం స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకువెళ్లారు. 

మొదటిసారిగా ఎమ్యెల్యేగా ఎన్నికైన సెల్వం (57) స్పీకర్ గా ఎన్నిక కావడం మరోసారి జరిగింది. గత శాసన సభలో కూడా కాంగ్రెస్ ఎమ్యెల్యే విపి శివకోజున్తు మొదటిసారిగా ఎమ్యెల్యేగా ఎన్నికై స్పీకర్ పదవి నిర్వహించారు. ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివిన సెల్వం 36 సంవత్సరాల పాటు డీఎంకే లో పనిచేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి పుదుచ్చేరి రాష్ట్ర ఉపాధ్యక్షులు అయ్యారు. అనేక  క్రీడా,సేవా కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. 

పైగా, పుదుచ్చేరిలో మొదటిసారిగా బిజెపి ఎమ్యెల్యే స్పీకర్ కావడమే కాకుండా, ఆ పార్టీ ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక కీలక అధికార పదవిని చేపట్టడం కూడా  ఇదే మొదటిసారి కావడం విశేషం.  మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పుదుచ్చేరిలో బిజేపి తరపున ఆరు మంది సభ్యులు ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల తర్వాత మరో ఆరుగురు స్వతంత్రుల మద్దతు సమకూర్చుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ – బీజేపీ కూటమి 16 సీట్లలో గెలిచి పుదుచ్చేరి అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కు 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత రంగ స్వామి గత నెల 7 చేశారు.

వచ్చేవారం మంత్రివర్గం ఏర్పాటు ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ విషయమై బిజెపితో ఒక అవగాహనకు వచ్చిన్నట్లు వెల్లడించారు. బీజేపీకి రెండు మంత్రి పదవులతో పాటుగా స్పీకర్‌ పదవిని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కేటాయించింది. మంత్రులు ఎంపిక చేసిన వారి జాబితాను గురు లేదా శుక్రవారం ఎల్జీ తమిళి సై సౌందరరాజన్‌ను కలిసి సమర్పించనున్నారు. ఈనెల 21న మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు.