12.94 శాతానికి టోకు ద్రవ్యోల్బణం

12.94 శాతానికి టోకు ద్రవ్యోల్బణం

వరుసగా ఐదో నెల మేలో కూడా టోకు ద్రవ్యోల్బణం పెరిగింది. ఈసారి 12.94 శాతంతో రికార్డు స్థాయి గరిష్ఠానికి చేరుకుంది. ముడి చమురు, తయారీ వస్తువుల ధరల పెరుగుదల కారణంగా టోకు ధరల సూచీ (డబ్లుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ మేరకు సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.

గతేడాది (2020) ఇదే నెలలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.37 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్‌లో ఇది రెండంకెలు 10.49 శాతానికి పెరిగింది. నెల ప్రతిపాదికన చూస్తే, మేలో 0.76 శాతం పెరిగింది. ప్రస్తుతం పెట్రోలు, ఎల్‌పిజి గ్యాస్, హైస్పీడ్ డీజిల్‌తో సహా ఇంధన రేట్లు తరచూ పెరుగుతుండడంతో ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి.

నెల ప్రాతిపదికన చూస్తే ఇంధన, విద్యుత్ రంగంలో 20.94 శాతం నుంచి 37.61 శాతానికి పెరిగింది. తయారీ రంగం వస్తువుల ధరలు గత నెలలో 9.01 శాతం నుంచి 10.83 శాతానికి పెరిగాయి. ఉల్లి ధరలు తగ్గినప్పటికీ మే నెలలో ఆహార వస్తువుల్లో ద్రవ్యోల్బణం 4.31 శాతానికి తగ్గింది. ఏప్రిల్‌లో ఇది 4.92 శాతంగా ఉంది. ఆహార యేతర వస్తువుల ధరల సూచీ గతేడాదిలో 18.3 శాతానికి పెరిగింది. ఏప్రిల్ ఇది 15.5 శాతంగా ఉంది.

మరోవంక, వినిమయ ధరల సూచీ (సిపిఐ) ఆధారిత దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఆహార, ఇంధన ధరలు పెరగడం వల్ల గత నెలలో ఇది 6.3 శాతానికి పెరిగింది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతంగా ఉంది. 

ఈసారి ఆహార ద్రవ్యోల్బణం 5.01 శాతానికి పెరగ్గా, అంతకుముందు ఏప్రిల్‌లో ఇది 1.96 శాతంగా ఉంది. 2026 మార్చి వరకు రిటైల్ ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో 4 శాతం లక్ష్యాన్ని ఆర్‌బిఐ నిర్ణయించింది. ఇది ప్రకటించిన ఐదు నెలల తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని దాటింది.