చైనా ఉత్పత్తుల పట్ల భారతీయుల విముఖత!

భారత్, చైనా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసిన గ‌ల్వాన్ లోయ ఘ‌ట‌న జ‌రిగి ఏడాది పూర్తయిన సంద‌ర్భంగా లోక‌ల్‌స‌ర్కిల్స్ రెండు దేశాల మ‌ధ్య వాణిజ్య సంబంధాల‌పై ఓ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో గ‌త 12 నెల‌ల్లో చైనా ఉత్పత్తుల‌పై భార‌తీయ వినియోగ‌దారులు ఎలా వ్య‌వ‌హ‌రించాన్న అంశం తేలింది.

అప్ప‌టి నుంచీ 40 శాతం మంది అస‌లు చైనా ఉత్ప‌త్తుల‌ను కొన‌లేద‌ని చెప్పడం గ‌మ‌నార్హం. భార‌త ప్ర‌భుత్వం కూడా టిక్‌టాక్‌, క్ల‌బ్‌ఫ్యాక్ట‌రీలాంటి చైనా యాప్స్‌ను నిషేధించిన విష‌యం తెలిసిందే. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ పేరుతో స్థానిక ఉత్ప‌త్తుల‌కు ప్రాధాన్య‌త ఇచ్చింది. 

వినియోగ‌దారులే కాదు స్థానిక వ్యాపారులు కూడా చైనా నుంచి దిగుమ‌తి చేసుకున్న ఉత్ప‌త్తుల‌ను భారీగా త‌గ్గించేశారు. ఈ తాజా సర్వే కోసం లోక‌ల్‌స‌ర్కిల్స్‌.. దేశంలోని 281 జిల్లాల నుంచి 18 వేల మంది వినియోగ‌దారుల స్పంద‌న‌ల‌ను తెలుసుకుంది. వీళ్ల‌లో 43 శాతం మంది గత ఏడాది కాలంలో ఒక్క చైనా ఉత్ప‌త్తిని కూడా కొన‌లేద‌ని తేలింది.

ఇక 34 శాతం మంది తాము ఒక‌టీ, రెండు ప్రోడ‌క్ట్‌ల‌ను కొన్నామ‌ని చెప్ప‌గా.. 8 శాతం మంది 3 నుంచి 5 ఉత్ప‌త్తుల‌ను కొన్న‌ట్లు తెలిపారు. ఒక్క శాతం మంది మాత్రం 20కిపైగా చైనా ప్రోడ‌క్ట్‌ల‌ను కొనుగోలు చేసిన‌ట్లు చెప్పారు. 

అయితే ఇప్ప‌టికీ మేడిన్ చైనా ఉత్ప‌త్తుల‌పై ఇండియా ఎక్కువ‌గానే ఆధార‌ప‌డినట్లు ఈ స‌ర్వేలో తేలింది. ముఖ్యంగా గ‌తేడాది ఎల‌క్ట్రానిక్ ప్రోడ‌క్ట్‌ల‌కు ఎక్కువ డిమాండ్ ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది. చాలా వ‌ర‌కూ చైనా ప్రోడ‌క్ట్‌ల‌కు ఇప్ప‌టికీ ఇండియాలో స‌రైన ప్ర‌త్యామ్నాయం లేక‌పోవ‌డం దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని లోక‌ల్‌స‌ర్కిల్స్ చెప్పింది.

ఇక ఇత‌ర అంత‌ర్జాతీయ స్థాయి వ‌స్తువులు కూడా చాలా వ‌ర‌కూ చైనాలో త‌యార‌వుతున్నాయ‌ని, వాటిపై కూడా మేడిన్ చైనా ట్యాగ్స్ ఉంటాయ‌ని తెలిపింది. క‌రోనా సెకండ్ వేవ్ సందర్భంగా భారతీయులు చాలా మంది ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు కొన్నారు. వీటిలో చాలా వ‌ర‌కూ మేడిన్ చైనావే. వీటి ధ‌రలు త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే కొన్న‌ట్లు 70 శాతం మంది చెప్ప‌డం విశేషం. చైనాకు ప్ర‌త్యామ్నాయంగా ఉన్న స్థానిక ప్రోడ‌క్ట్ ధ‌ర ఎక్కువ‌గా ఉంటోంద‌ని స‌ర్వేలో పాల్గొన్న వారు చెప్పారు.