‘జీ 7’కి భారత్‌ సహజ మిత్రదేశం

గ్రూప్‌ 7(జీ 7) దేశాలకు భారత్‌ సహజ మిత్రదేశమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నిరంకుశవాదం, తప్పుడు సమాచారం, ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం, ఆర్థికపరమైన ఒత్తిడి.. తదితరాల నుంచి ఉద్భవించే సవాళ్ల నుంచి సభ్యదేశాల భాగస్వామ్య విలువలను రక్షించుకునే దిశగా భారత్‌ తన కృషిని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

 ‘జీ 7’ సదస్సులో ‘ఓపెన్‌ సొసైటీస్‌ అండ్‌ ఓపెన్‌ ఎకానమీస్‌’ అంశంపై ప్రధాని మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రసంగీస్తూ ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులకు భారత్‌ కట్టుబడి ఉందన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ, జామ్‌ (జన్‌ధన్‌–ఆధార్‌– మొబైల్‌ ఆనుసంధానం)లను ఉటంకిస్తూ సామాజిక సమ్మిళితం, సాధికారతను సాధించడంలో సాంకేతికతను భారత్‌ ఎలా విప్లవాత్మకంగా ఉపయోగించుకుందో వివరించారు.

స్వేచ్ఛాయుత సమాజాల్లో అంతర్గతంగా దాగి ఉన్న ముప్పులపై హెచ్చరిస్తూ.. టెక్నాలజీ సంస్థలు, సోషల్‌ మీడియా సంస్థలు తమ వినియోగదారులకు సురక్షిత సైబర్‌ వాతావరణాన్ని అందించాల్సి ఉందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని ప్రసంగ వివరాలను విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పీ హరీశ్‌ మీడియాకు తెలిపారు. ప్రధాని మోదీ అభిప్రాయాలను కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు స్వాగతించారని హరీష్ పేర్కొన్నారు.

‘స్చేచ్ఛాయుత, అంతర్జాతీయ నియమానుసార ఇండో పసిఫిక్‌ ప్రాంతం కోసం కృషి చేస్తామని ‘జీ 7’ నేతలు స్పష్టం చేశారు. ఇందుకు ఈ ప్రాంతంలోని మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామన్నారు’ అని హరీశ్‌ వివరించారు. కోవిడ్‌ టీకాలకు పేటెంట్‌ మినహాయింపు కోరుతూ భారత్, దక్షిణాఫ్రికాలు చేసిన ప్రతిపాదనకు జీ7 సదస్సులో విస్తృత మద్దతు లభించిందని అయన చెప్పారు.