అయోధ్య‌లో మ‌హారాణా ప్ర‌తాప్ విగ్ర‌హం 

రామ‌జ‌న్మ జ‌న్మ‌భూమి అయోధ్య‌లో మ‌హారాణా ప్ర‌తాప్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠించ‌నున్నారు. దీనిలో భాగంగా వీర్ శిరోమణి మహారాణా ప్రతాప్ భారీ విగ్రహానికి పూజ‌లు నిర్వ‌హించి, పుష్పాలు అర్పించిన రాజ‌స్థాన్  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పూనియా ఆ విగ్ర‌హాన్ని జైపూర్ నుంచి అయోధ్యకు త‌ర‌లించారు. 
 
ఈ సంద‌ర్భంగా డాక్టర్ పూనియా వీర్ శిరోమణి మహారాణా ప్రతాప్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ప్ర‌ముఖ కళాకారుడు మహావీర్ భారతి త‌యారు చేసిన ఈ 1500 కిలోల బ‌రువుగ‌ల అష్టాధాతు మహారాణ ప్రతాప్ విగ్రహాన్ని రామ‌జ‌న్మ‌భూమి అయిన‌ అయోధ్యలో ప్ర‌తిష్ఠించ‌నున్నార‌ని చెప్పారు. 
 
దీనిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించనున్నార‌ని తెలిపారు. ఇక‌పై రాజస్థాన్ వీరోచిత గాథ‌లు అయోధ్యలో కూడా వినిపించి, స్ఫూర్తినిస్తాయని తెలిపారు. 
 
మహారాణా ప్రతాప్ ఎప్పుడూ ప‌రాధీన‌త‌ను అంగీక‌రించ‌లేద‌ని, ఆత్మగౌరవంతో మొఘలులను ఓడించార‌ని ఆయన గుర్తు చేశారు. అసమాన యోధునిగా మహారాణా ప్రతాప్ చూపిన తెగువ‌, ప్ర‌ద‌ర్శించిన‌ ధైర్యం, శౌర్యం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని పేర్కొన్నారు. ఇది కొత్త తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంద‌ని చెప్పారు.