మమతకు `సుప్రీం’ మొట్టికాయ, టిఎంసిలో ముకుల్ రాయ్ 

ఒక వంక బిజెపి జాతీయ అధ్యక్షుడు ముకుల్ రాయ్ కోల్కత్తాలో తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంకు, వెళ్లి పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తిరిగి ఆ పార్టీలో చేరుతుండగా, మరోవంక ఢిల్లీలో సుప్రీం కోర్టు ఆమెకు మొట్టికాయ‌ వేసింది. 
 
ఆ రాష్ట్రంలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్ప‌కుండా వెంట‌నే ఈ పథకాన్ని వ‌ర్తింప‌జేయాల‌ని సుప్రీం కోర్టు శుక్ర‌వారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది వలస కార్మికులను దృష్టిలో పెట్టుకొని తెచ్చిన పథకమ‌ని. మీ సమస్యలను ఉదహరించకుండా పథకాన్ని త‌క్ష‌ణం అమలు చేయాల‌ని మ‌మ‌త ప్ర‌భుత్వానికి స్ప‌ష్టం చేసింది.

కాగా, ప‌శ్చిమ బెంగాల్‌, అస్సాం, ఢిల్లీలో త‌ప్ప దేశ‌వ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రేష‌న్ ప‌థ‌కం అమ‌ల‌వుతున్న‌ది. అయితే రాజకీయ కారణాలతో సీఎం మమత బెంగాల్‌లో, సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, ఆ పార్టీ నేత‌లు మండిప‌డుతున్నారు.

మరోవంక, ముకుల్ రాయ్, ఆయ‌న కుమారుడు సుభ్రంగ్సు రాయ్‌.. తిరిగి తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సంద‌ర్భంగా ముకుల్ రాయ్‌ను పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించిన మ‌మ‌తా బెన‌ర్జీ, ఆమె మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ స‌న్మానించారు. ఇత‌రుల‌ మాద‌రిగా ముకుల్ రాయ్ దేశ‌ద్రోహి కాద‌ని ఆమె స్పష్టం చేశారు.

 ‘‘కుమారుడు తిరిగి సొంతింటికి చేరుకున్నాడు. ముకుల్ రాయ్ ఇంటి పిల్లవాడు. తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. పార్టీలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు” అని మమతా ప్రకటించారు. 

2017లో తృణ‌మూల్‌ను వీడిన ముకుల్ రాయ్‌.. మ‌ళ్లీ సొంత‌గూటికి చేరుకున్నారు. బీజేపీని వీడిన త‌ర్వాత ఎంతో సంతోషంగా ఉంద‌ని చెబుతూ తాను బీజేపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నాన‌ని పేర్కొన్నారు. సీఎం మ‌మ‌త‌తో త‌న‌కెలాంటి విబేధాలు లేవ‌ని ముకుల్ రాయ్ స్ప‌ష్టం చేశారు.