కోవిడ్ వ్యాక్సిన్ల‌పై ప‌న్ను త‌గ్గింపు!

కరోనా వ్యాక్సిన్లు, ఇత‌ర ఔష‌ధాలు, అత్యవసర చికిత్స‌ వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్ను తగ్గింపుకు రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 12న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అధ్యక్షతన
జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశం జ‌రుగ‌నున్న‌ది. 
 
గ‌త నెలాఖ‌రులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు, ఔష‌ధ ప‌రిక‌రాల‌పై ప‌న్ను మిన‌హాయింపుపై చ‌ర్చించేందుకు ఏర్పాటైన మంత్రివర్గ సంఘం (జీవోఎం) నివేదిక సమర్పించింది. కరోనాకు చికిత్సకు వాడే సామగ్రైన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని మే 28వ తేదీన జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు కోరారు.

ఈ సామగ్రిపై పన్ను మినహాయించే అంశంపై అధ్యయనానికి మేఘాలయ సీఎం క‌న్ర‌డ్‌ సంగ్మా నేతృత్వంలో జీవోఎం ఏర్పాటైంది. ఈ జీవోఎంలో తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి టీ హ‌రీశ్ రావు కూడా స‌భ్యులు.

క‌న్ర‌డ్ సంగ్మా సార‌ధ్యంలోని జీవోఎం ఈ నెల ఏడో తేదీన నివేదిక సమర్పించింద‌ని ఆర్థిక‌శాఖ అధికారులు తెలిపారు. క‌మిటీ స‌భ్యుడు, యూపీ ఆర్థికమంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ రోగుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డానికి త‌మ రాష్ట్రం అనుకూల‌మేని పేర్కొన్నారు.

క‌రోనా రోగులకు ఉపశమనం కల్గించేలా కరోనా చికిత్స సామాగ్రిపై పన్నులు తగ్గించే అంశంపై తమ రాష్ట్రం అనుకూలంగానే ఉన్నద‌ని సురేశ్ కుమార్ ఖ‌న్నా చెప్పారు. అయితే, జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన పన్ను రేట్లను అంగీకరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్లపై ఐదు శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు.