జితిన్ నిష్క్రమణతో సచిన్ పై కాంగ్రెస్ లో ఖంగారు!

కాంగ్రెస్ పార్టీ యువ నేతలు ఒక్కొక్కరుగా భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ప్రశ్నార్ధకరంగా మారుతున్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీకి సన్నిహితులుగా పేరొందిన యువనేతలు అసంతృత్తి నేతలుగా మారుతూ ఉండడంతో రాహుల్ రాజకీయ భవిష్యత్ పైననే నీలినీడలు ఆవహిస్తున్నాయి. 

ఏడాది క్రితం మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సిందియా తనకు మద్దతుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ లో చేరడమే కాకుండా అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టారు.  కర్ణాటకలో కూడా దాదాపు ఆ విధంగానే జరగడంతో అక్కడ కూడా కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. 

ఆ తర్వాత బిజెపి లక్ష్యం రాజస్థాన్ అని అందరూ భావించారు. అక్కడ సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్డమయ్యారు. అందుకు బిజెపి అవసరమైన మద్దతు ఇవ్వడానికి కూడా సిద్దపడింది. అయితే అనుకున్నంత సంఖ్యలో ఎమ్యెల్యేలను కూడదీసుకోలేక పోవడంతో సచిన్ పార్టీ అధిష్ఠానంతో రాజీపడవలసి వచ్చింది. 

ఫలితంగా ఉపముఖ్యమంత్రి పదవితో పాటు, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికూడా పోగొట్టుకోవాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అదను చూసి అశోక్  గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. కానీ ఈ లోగా ఉత్తర ప్రదేశ్ నుండి యువనేత జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం కాంగ్రెస్ వర్గాలను ఖంగు తినిపిస్తున్నది. 

ఉత్తర ప్రదేశ్ లో మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో, రాష్ట్రంలో పార్టీ సీట్లు, ఓట్లు పెంచుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఒక బలమైన సామజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద బీజేపీలో చేరడం కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.

ఈ సమయంలో  సచిన్ పైలట్ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడల గురించి మరోసారి చర్చ బయలుదేరుతుంది.  కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో సిందియా, సచిన్ ప్రముఖులు. కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటముల్లో ఉన్న సమయంలో రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వాలను కూలదోసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో వీరిద్దరూ కీలక పాత్ర వహించారు.

వారిద్దరిని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చేయాలని రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీలోని వృద్ధ నాయకత్వం సోనియా గాంధీపై వత్తిడి తెచ్చి పడనీయలేదు. అప్పటి నుండి పార్టీలో యువనేతలు పక్కచూపులు చూడటం ప్రారంభించారు.

నెల క్రితం నాటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడం పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇలాంటి సందర్భంలో సచిన్ పైలట్ పార్టీని వీడితే భవిష్యత్ లేని కురువృద్ధ పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందనే భయాలు పార్టీ వర్గీయుల్ని తీవ్రంగా కలవర పెడుతున్నాయి.

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఈ లోగా సచిన్ కు బీజేపీలో చేరడం తప్ప మరో మార్గం ఉండకపోవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.